గుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు
విజయనగరం జిల్లాలోని వంగర మండలం కొండవలస గ్రామం నుంచి భాగెమ్మపేట వరకు సుమారు 10 గ్రామాలున్నాయి. ఈ రోడ్లన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయి. దాదాపు 15 ఏళ్లుగా గుంతలమయం అయిపోయాయి. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడం వల్ల గ్రామస్థులు వింత నిరసన చేపట్టారు. తమ సమస్యేంటో తెలియజేస్తూ...ఆ రోడ్లపై డ్రోన్‌లు ఎగరేశారు. డ్రోన్ కెమెరాకు రోడ్డు వేయాలంటూ ఓ ప్లకార్డ్ తగిలించి ఇదంతా రికార్డ్ చేశారు. గుంతల రోడ్డుతో తామెంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం వెంటనే తమ గ్రామాలకు రోడ్లను నిర్మించాలని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీలో రోడ్లపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. 2025 పూర్తయ్యే లోగా రోడ్లకు మరమ్మతులు చేయిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు. అటు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనులు స్వయంగా పరిశీలిస్తున్నారు. రోడ్ల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి.