BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Election Commision: దేశంలో రాజకీయ పార్టీలకు ఎవరైనా విరాళాలు ఇవ్వాల్సి వస్తే అది మొదటగా బీజేపీకే వెళ్తోంది. మొత్తం విరాళాల్లో సగం బీజేపీకి ఇస్తున్నారు. మిగతా సగాన్ని ఇతర పార్టీలు పంచుకుంటున్నాయి.
BJP receives 2244 crore in contributions in 2023-24: గెలిచే పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీ అందరూ విరాళాలు ఇవ్వాలనకుంటారు. అందుకే బీజేపీకి పంట పండుతోంది. 2023-24లో ఆ పార్టీకీ రూ .2,244 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎన్నికల ఏడాది కావడంతో పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి. అంతకు ముందు ఏడాది 2022-23లో రూ .700 కోట్లు మాత్రమే విరాళాలు వచ్చాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 2023-24లో బీజేపీ విరాళాలు 212 శాతం పెరిగాయి. ఎన్నికల కమిషన్ కు రాజకీయ పార్టీలు సమాచారాన్ని ప్రకటించాయి.
బీజేపీకి రెండొందల శాతం పెరిగిన విరాళాలు
కాంగ్రెస్ పార్టీకి 2022-23లో రూ.79.9 కోట్లు రాగా గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం పెరిగాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ రూ.288.9 కోట్లు విరాళాలు పొందింది. బిజెపి, కాంగ్రెస్ రెండింటికీ గణనీయమైన విరాళాలు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వచ్చాయి. ఈ ట్రస్టు నుంచి బీజేపీకి రూ.723.6 కోట్లు రాగా, కాంగ్రెస్ కు రూ.156.4 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం విరాళాల్లో మూడింట ఒక వంతు బీజేపీకి దక్కాయి. కాంగ్రెస్ కు వచ్చిన విరాళాల్లో సగానికిపైగా ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారానే వచ్చాయి.
కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్‌కు అందింతే రెట్టింపు
2022-23లో ట్రస్ట్ ప్రధాన దాతల్లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆర్సెలర్ మిట్టల్, భారతీ ఎయిర్టెల్ వంటి వారు ఉన్నారు.ఎన్నికల ఎడాదిలో ఎవరు ఎక్కువగా ఇచ్చారో ఇంకా బయటకు రాలేదు. ప్రాంతీయ పార్టీలు కూడా తమ 2023-24 నివేదికల్లో ఎలక్టోరల్ బాండ్లు, ఇతర మార్గాల ద్వారా విరాళాలను ప్రకటించాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తెలంగాణ కు చెందిన భారత రాష్ట్ర సమితి అత్యధికంగా రూ.495.5 కోట్లు పొందింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అందిన విరాళాల కన్నాచాలా ఎక్కువ. డీఎంకే రూ.60 కోట్లు, వైఎస్సార్ కాంగ్రెస్ రూ.121.5 కోట్లు విరాళాలను పొందింది.
ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఇకపై అమల్లో లేకపోవడంతో రాజకీయ పార్టీలు నిధుల కోసం ప్రత్యక్ష విరాళాలు, ఎలక్టోరల్ ట్రస్టులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల స్కీమును సుప్రీంకోర్టు చట్ట విరుద్దంగా ప్రకటించింది కానీ ఇప్పటి వరకూ ఆ బాండ్ల ద్వారా ఇచ్చిన మొత్తాన్ని అక్రమం అని ప్రకటించలేదు. అందుకే ఆ స్కీమ్ రద్దయింది. ఇప్పుడు ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా విరాళాలను ప్రకటిస్తున్నారు.