Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Roja Comments: మాజీ మంత్రి రోజా గేర్ మార్చారు. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆమె మళ్లీ ఫైర్‌బ్రాండ్‌లా మారుతున్నారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో ఆమెలో కూడా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది.
Roja Comment On Govt: చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాజీ మంత్రి జోష్ పెంచారు. ఎన్నికల కంటే ముందు తన శాఖ, నియోజకవర్గానికి పరిమితమై మాట్లాడిన రోజా ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి తప్పించి కరుణాకరెడ్డికి ఇచ్చినప్పటి నుంచి గేర్ మార్చారు.
గేరు మార్చిన రోజా
కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న గతంలో తాను నిర్వహించిన శాఖలో అవినీతి జరిగిందని మీడియా అడిగితే... ఫైల్స్ వాళ్ల దగ్గరే ఉన్నాయని ఏం చేసుకుంటారో చేసుకోమన్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 14సీట్లు కచ్చితంగా గెలుస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ఓడిపోవడానికి తాము చేసిన తప్పులేం లేవని... కేవలం కూటమి తప్పుడు వాగ్దానాలతోనే ప్రజలు బోల్తాపడ్డారని అభిప్రాయపడ్డారు.
నగరిలో రివ్యూ
నగరిలో వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి. ఈ భేటీకి నగరి ఇన్‌ఛార్జ్ రోజాతోపాటు మిగతా నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టబోయే నిరసన కార్యక్రమంతోపాటు భవిష్యత్‌లో చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
సమీక్ష సమావేశం తర్వాత మాట్లాడిన రోజా కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తన గురువు అయిన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు రోజా. కార్యకర్తల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
తప్పుడు ప్రచారంతోనే ఓటమి
కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైసీపీ ఓడిపోయిందన్న రోజా... అందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. అన్నిహామీలు నెరవేర్చిన వ్యక్తికి ఓటు వేయకుండా మోసం చేసే వాళ్లకు ఎలా ఓటు వేశామనే బాధ వారిలో ఉందన్నారు. మరోసారి వైసీపీయే కావాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు రోజా. ప్రతి వర్గం కూడా జగన్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ ఓడిపోవాలని కోరుకున్న ఉద్యోగులు కూడా ఇప్పుడ పశ్చాత్తాపడుతున్నారని తెలిపారు.
సంపద సృష్టించి సూపర్ సిక్స్ అమలు చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు అప్పులు చేస్తూ ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు రోజా. అందుకే ప్రజలు మళ్లీ జగన్ వైపు చూస్తున్నారని రోజా తెలిపారు. కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు, బెదిరింపులకు భయపడొద్దని శ్రేణులకు సూచించారు. చిత్తూరు జిల్లాలో ప్రతి కార్యకర్తకు భూమన కరుణాకర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. రాబోయేది జగన్ ప్రభుత్వమేనని వచ్చిన తర్వాత అందరికీ వడ్డీతో చెల్లిస్తామని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి ఉన్నప్పుడు ఇద్దరికీ పడేది కాదు. అందుకే ఆమెకు సరైన ప్రాధాన్యత లేదని చాలా సార్లు సన్నిహితుల వద్ద వాపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు చాలా మంది వైసీపీ నేతలే ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మారిన తర్వాత తన వ్యతిరేకలపై వేటు వేయించగలిగారు రోజా.
Also Read: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు