Malavika Mohanan: ‘తంగలాన్’ వల్ల ఐదుగురు డాక్టర్లను కలిశాను... ఒళ్లంతా మంట - మాళవికా మోహనన్
Malavika Mohanan: పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తంగలాన్’ కోసం నటీనటులంతా డీ గ్లామర్ పాత్రల్లో కనిపిస్తూ గుర్తుపట్టకుండా అయిపోయారు. అలా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డారో హీరోయిన్ మాళవికా బయటపెట్టింది.
Malavika Mohanan About Thangalaan: ప్రస్తుతం సౌత్‌లో పలు ప్రయోగాత్మక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘తంగలాన్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్, పోస్టర్స్... ఇలా అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో హీరోగా నటించిన విక్రమ్ మాత్రమే కాదు... ప్రతీ యాక్టర్ కూడా చాలా మారిపోయారు. ‘తంగలాన్’లో హీరోయిన్‌గా మాళవికా మోహనన్ నటించగా... మలయాళ భామ పార్వతీ కూడా ఇతర ముఖ్య పాత్రలో కనిపించింది. తాజాగా వీరిద్దరూ ‘తంగలాన్’ కోసం ఎదుర్కున్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
ఎలర్జీ వచ్చేసింది..
‘తంగలాన్’లో విక్రమ్‌తో పాటు మాళవికా మోహనన్, పార్వతీ కూడా డీ గ్లామర్ రోల్‌లోనే కనిపించారు. దాని కోసం వారు ఎంత కష్టపడ్డారో మాళవికా తాజాగా బయటపెట్టింది. ‘‘నేను అయిదుగురు డాక్టర్లను కలవాల్సి వచ్చింది. స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ఐ డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే నేను తంగలాన్ కోసం రోజుకు 4 నుండి 5 గంటల వరకు మేకప్ వేసుకునేదాన్ని. బాడీ మేకప్, టాటూ మేకప్, కాస్ట్యూమ్స్, విగ్ అంతా కలిపి అంత టైమ్ పట్టేది. వాటన్నింటిలో కెమికల్స్ ఉంటాయి. దాదాపు 10 గంటల పాటు బాడీపై కెమికల్స్ ఉండేసరికి ఎలర్జీ వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది మాళవికా మోహనన్.
ఒళ్లంతా మంట..
‘‘మేకప్ వల్ల ఒంటి మీద ర్యాషెస్ వచ్చాయి. మేము రోజంతా ఎండలోనే ఉండేవాళ్లం. గొడుగులు ఉండేవి కాదు. గొడుగుల గురించి మేము ఆలోచించేవాళ్లం కూడా కాదు. మేము మా పాత్రను మంచిగా చేయాలనే ఆలోచిస్తూ ఉండేవాళ్లం. షూటింగ్ అయిపోయి రూమ్‌కు వచ్చిన తర్వాత చూసుకుంటే ఒంటిపై మొత్తం మంటగా ఉండేది. నా క్యారెక్టర్ కోసం భయంకరంగా కనిపించడానికి నేను లెన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ లెన్స్ వల్ల నా కళ్లు ఎండిపోయాయి. షూటింగ్ సమయంలో చాలా స్మోక్ ఉపయోగించేవాళ్లు. స్మోక్, డస్ట్ వల్ల కూడా చర్మ సమస్యలు వచ్చేవి’’ అని తెలిపింది మాళవికా మోహనన్. ఆమెతో పాటు పార్వతి కూడా తన ఇబ్బందుల గురించి మాట్లాడింది.
చెప్పులు లేకుండా నడిచాం..
‘‘రోజూ షూటింగ్ కోసం చాలా దూరం నడవాల్సి వచ్చేది. అది కూడా చెప్పులు లేకుండా. ఒకరోజు సాయంత్రం 5 గంటలకు లైట్ పోతుంది అనుకునే సమయంలో ఒక సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. అప్పుడు నన్ను గొడ్డలితో భూమిని తవ్వమన్నారు. అసలు అలా చేయాలని నాకు ముందు తెలియదు. సాయంత్రం అయ్యింది కదా ఏదో ఈజీ సీన్ అనుకున్నాను. ఇది కూడా ఈజీనే చేసేయమని డైరెక్టర్ అన్నారు. ఆయన అన్నింటిని ఈజీ అనే అనేవారు’’ అని గుర్తుచేసుకుంది పార్వతి. ‘తంగలాన్’ను ‘కబాలి’ ఫేమ్ పా రంజిత్ డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్టుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
Also Read: విక్రమ్ 'తంగలాన్' రిలీజ్ డేట్ వచ్చేసింది - రెండు భారీ తెలుగు సినిమాలకు పోటీగా థియేటర్లోకి..