Vijay Deverakonda: నా పేరు పక్కన 'The' పెట్టింది అందుకే? అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తన పేరు పక్క ‘ది’ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘ఖుషి’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన పేరుకు ముందు ‘ది’ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా వివరించారు.
పేరుకు ముందు ‘The’ ఎందుకు పెట్టుకున్నానంటే?- విజయ్
సినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ ఉన్నది ఒక్కడే కాబట్టి పేరుకు ముందు ‘ది’ అని పెట్టుకున్నట్లు వివరించారు. “లైగర్ మూవీ సమయంలో సోషల్ మీడియాలో మంచి పేరు పెట్టుకోవాలని ఒత్తిడి పెరిగింది. వద్దురా అని కొట్లాడుతుంటే, చాలా మంది ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. రౌడీ స్టార్ అని, సౌత్ సెన్సేషన్ అని, ఏది దొరికితే అది రాస్తున్నారు. కొత్తగా ఇంకా ఏం అంటిస్తారోనని భయం అయ్యింది. ‘లైగర్’ సినిమా సమయంలో దర్శకుడు పూరి రెండు, మూడు పేర్లు చెప్పారు. కానీ, నాకు నా పేరే సరిపోతుంది. మా అమ్మానాన్న పెట్టిన పేరే బాగుంటుంది అనుకున్నాను. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నడు. దానికి ‘ది’ అని పెట్టండి అన్నాను. పేరుకు ముందు, వెనుక టైటిల్స్ వద్దు అని చెప్పాను” అన్నారు.
విజయ్ పై అనసూయ తీవ్ర విమర్శలు
ఒకానొక సమయంలో విజయ్ దేవరకొండ పేరుకు ముందు ‘ది’ అని పెట్టుకోవడంపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కొంత కాలం పాటు విజయ్ టార్గెట్ గా అనసూయ వరుస ట్వీట్లు వైరల్ అయ్యాయి. నిత్యం విజయ్ అభిమానులు, ఆనసూయ మధ్యన సోషల్ మీడియాలో యుద్ధమే జరిగేది. రీసెంట్ ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టబోతున్నట్లు అనసూయ వెల్లడించింది. అప్పటి నుంచి విజయ్ గురించి ఆమె ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు.
ఇక ‘ఖుషి’ సినిమా నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్, రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకున్నాయి. పాటలు అందరినీ అద్భుతంగా అలరించాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచింది. సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ అందరినీ అలరించింది. 'మహానటి' తర్వాత సమంత -విజయ్ దేవరకొండ కలిసి 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వర్క్ చేశారు. పీటర్ హెయిన్ యాక్షన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా విజయ్ దేరవకొండ, సమంత, శివ నిర్వాణలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Read Also: మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు: రజినీ ఆఖరి పంచ్ వైసీపీ నేతలకేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial