Rajinikanth: మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు: రజినీ ఆఖరి పంచ్ వైసీపీ నేతలకేనా?
రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్‘. ఆగష్టు 10న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ వైసీపీ గురించేనని టాక్ నడుస్తోంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం 'జైలర్'. ఆగష్టు 10న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై సౌత్ లో ఓ రేంజిలో హైప్ నెలకొంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాటలు, ట్రైలర్ అదుర్స్ అనిపించాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వైసీపీకి రజనీ కౌంటర్ ఇచ్చారా?
‘జైలర్’ ప్రీ రిలీజ్ స్పీచ్ లో రజినీకాంత్ తన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకున్నా పట్టించుకోనని చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. "మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరు లేదు. వాటి గురించి పట్టించుకోకుండా, మనం మన పని చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా" అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు ప్రేక్షకులు కరతాళధ్వనులతో మద్దతు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలను రజనీకాంత్ వైసీపీ నాయకులను ఉద్దేశించి చేశారని కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.
అర్థమైందా రాజా..!
— నాయుడు గారు (అద్దంకి const) (@1950Cbn) August 8, 2023
గంభీరంగా ఒక్క నవ్వు నవ్వాడు తలైవా ❤️
Slipper shot to #PayTMDogs#SuperstarRajnikanth
pic.twitter.com/EbPzr4zTGp
గతంలో రజనీపై వైసీపీ నేతల విమర్శలు
కొద్ది నెలల క్రితం ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. “చంద్రబాబు ముందుచూపు కలిగిన వ్యక్తి. న్యూయార్క్ నగరాన్ని తలపించేలా హైదరాబాద్‌ను రూపొందించారు. చంద్రబాబు విజన్ 2047 గురించి నాకు చెప్పారు. అది సాకారం అయితే, ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుంది. ఆయన వేసిన ప్రణాళికలు అమలు కావాలని భావిస్తున్నాను” అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలను రజనీకాంత్ పట్టించుకోలేదు. కానీ, ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో వైసీపీ మీద, ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. జైలర్, ఖైదీ అంటూ వైసీపీ నాయకుల ఫోటోలు, రజనీకాంత్ ఫోటోలు పక్కపక్కన పెట్టి ట్రోల్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. తాజాగా రజనీ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించినవేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇక ‘జైలర్’ మూవీని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రజనీకాంత్ కి జోడిగా తమన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. రమ్యకృష్ణ, సునీల్, యోగి బాబు, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
Read Also: ఈడో పెద్ద దూలగాడు, ఆడ పిల్లలను అలా చూడకు దరిద్రంగా - రాజా రవీంద్రకు చిరంజీవి చురకలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial