Adipurush vs Baahubali : 'బాహుబలి' క్లైమాక్స్ గుర్తు చేసిన 'ఆదిపురుష్' ట్రైలర్ - ఆ ఒక్క డైలాగ్ లేకపోతే?
'ఆదిపురుష్' ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ అభిమానులకు ఇది నచ్చింది. అయితే, ఆ ట్రైలర్ కొందరికి 'బాహుబలి'ను గుర్తు చేసింది. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
'బాహుబలి' (Baahubali) విడుదలై దాదాపు ఎనిమిదేళ్లు! అయినా సరే ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్... 'ఆదిపురుష్' ట్రైలర్ (Adipurush Trailer). ఇప్పుడీ ట్రైలర్ చాలా మంది తెలుగు ప్రేక్షకులకు 'బాహుబలి'ని గుర్తు చేసింది. అందులో యుద్ధానికి ముందు సైనికులను సిద్ధం చేయడానికి ప్రభాస్ చెప్పిన డైలాగులను మరోసారి గుర్తు చేసింది.
నాతో వచ్చేదెవరు? - 'బాహుబలి'లో!
'బాహుబలి' క్లైమాక్స్ సీన్ గుర్తు ఉందా? శత్రు సైన్యం ధాటికి 'మరణం... మరణం' అంటూ సైనికులు అందరూ వెనుదిరుగుతున్న సమయంలో ''మహాసేనా... ఏది మరణం? మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణ రంగంలో చావు కన్నా పిరికితనంతో బతికి ఉండటంతో మరణం! మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ... దిగి చూస్తుంటే? వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం! ఆ మరణాన్ని జయించడానికి నేను వెళుతున్నాను. నా తల్లిని, నా నేలను ఏ నీచుడూ, నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను! నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేది ఎవరు? ఆ మరణాన్ని దాటి నాతో బతికేదెవరు?'' అని స్థైర్యాన్ని నింపుతారు ప్రభాస్.
ఇప్పుడు 'ఆదిపురుష్'కు వస్తే...
తాజాగా విడుదలైన 'ఆదిపురుష్' ట్రైలర్ విషయానికి వస్తే... వానర సైన్యంతో కలిసి లంక మీదకు శ్రీరాముడు యుద్ధానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు. మనం అందరం రామాయణంలో జరిగింది చదివి తెలుసుకున్నాం. లంకపై యుద్ధానికి ముందు రాముడు ఏం చెప్పాడు?
''నా కోసం పోరాడొద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథను చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు! అహకారం రొమ్ము చీల్చి... ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి'' అని శ్రీరామ పాత్రధారి ప్రభాస్ నోటి వెంట 'ఆదిపురుష్' ట్రైలర్ లో డైలాగులు వినిపించాయి. అది 'బాహుబలి : ది బిగినింగ్'లో క్లైమాక్స్ వార్ సీక్వెన్సులో డైలాగులను గుర్తు చేసింది. అదీ సంగతి! 'పోరాడతారా? అయితే దూకండి ముందుకు' డైలాగ్ లేకపోతే పోలికలు వేరేలా ఉండేవి ఏమో!?
Also Read : 'విరూపాక్ష' విజయంతో సత్యం రాజేష్ రెండో 'పొలిమేర'కు పెరిగిన క్రేజ్!
నిజం చెప్పాలంటే... 'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ వీరాభిమానులు సైతం సినిమా మీద ఆశలు వదిలేసుకున్నారు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ మీద వచ్చిన ట్రోల్స్ అయితే లెక్క లేదు. రాముడిగా ప్రభాస్ రూపం సైతం కొంత మంది అభిమానులకు నచ్చలేదు. లంకాధిపతి రావణ బ్రహ్మ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ గెటప్ మీద హిందుత్వ అభిమానులు విరుచుకుపడ్డారు. ఎప్పుడో ఒకప్పుడు సినిమా విడుదలైతే... ఆ తర్వాత వచ్చే 'సలార్'తో బాక్సాఫీస్ లెక్కలు మళ్ళీ సరి చేస్తాడని కూడా కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి. టీజర్ చూసి నిరాశ చెందిన అభిమానులను శాటిస్ ఫై చేసింది. సినిమాపై అంచనాలకు మళ్ళీ ప్రాణం పోయడంలో ట్రైలర్ సక్సెస్ అయ్యింది. అయితే, ఈ ట్రైలర్ మీద విమర్శలు చేసే వ్యక్తులు సైతం సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : విజయ్ దేవరకొండ బర్త్‌డే గిఫ్ట్ - 'ఖుషి'లో తొలి పాట వచ్చేసిందోచ్!