Actress Shakeela: లైంగిక వేధింపులపై నోరు విప్పిన నటి షకీలా - టాలీవుడ్ పైనా షాకింగ్ కామెంట్స్
మలయాళీ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశం తీవ్ర దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో నటి షకీలా షాకింగ్ కామెంట్స్ చేసింది. తమిళ, తెలుగు ఇండస్ట్రీలోనూ మహిళా నటులపై వేధింపులు ఉన్నాయన్నారు.
Actress Shakeela On Sexual Harassment: మహిళా నటులపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుమలయాళీ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది. పలువురు నటీమణులు గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి బయటకు చెప్తున్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా పలువురు సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
లైంగిక వేధింపులపై నటి షకీలా షాకింగ్ కామెంట్స్
హేమ కమిటీ రిపోర్టుపై తాజాగా ప్రముఖ నటి షకీలా స్పందించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితం కాదన్నారు. తమిళం, తెలుగు సినీ పరిశ్రమలోనూ ఉన్నాయన్నారు. “లైంగిక వేధింపులు మలయాళీ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు, తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలోనూ ఉన్నాయి. దేశంలోని పలు సినీ ఇండస్ట్రీలలోనూ ఉన్నాయి. మలయాళ పరిశ్రమలో మహిళలకు భద్రత తక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో ఎదురవుతున్న లైంగిక వేధింపుల వ్యవహారాలు బయటకు ఎక్స్ పోజ్ కావాల్సిన అవసరం ఉంది” అని షకీలా చెప్పారు.
పిల్లికి గంట కట్టాల్సిందే- షకీలా
సినీ పరిశ్రమలో ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి కొంత మంది మాట్లాడుతున్నారని, మరికొంత మంది రకరకాల కారణాలతో బయటకు చెప్పుకోలేకపోతున్నారని షకీలా వెల్లడించారు. “ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా కనిపిస్తారు. మొదట్లోనే తాము అలాంటి పని చేయలేం అని గట్టిగా చెప్తే మున్ముందు సమస్యలు రాకుండా ఉంటాయి. కమిటీలు, నివేదికలు కేవలం లైంగిక వేధింపుల విషయాన్నే బయట పెడుతున్నాయి. కానీ, బాధ్యుతలపై చర్యల విషయంలో పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వాలు ఇండస్ట్రీలో వేధింపుల గురించి కఠిన చర్యలు తీసుకోవాలి. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా పిల్లి మెడలో గంట కట్టాల్సిన అవసరం ఉంది” అని షకీలా అభిప్రాయపడ్డారు.
సంచలనం సృష్టించిన హేమ కమిటీ రిపోర్టు
రీసెంట్ గా జస్టిస్ హేమ కమిటీ తన రిపోర్టును కేరళ సీఎం పినరయి విజయన్ కు అందించింది. ఈ నివేదికలో ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న 17 రకాల ఇబ్బందుల గురించి వెల్లడించింది. సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లైంగికంగా లొంగిపోవాల్సి వస్తుందని వివరించింది. మలయాళీ ఇండస్ట్రీ కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటుల నియంత్రణలో ఉందని వెల్లడించింది.
సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగిన షకీలా
ఇక షకీలా ఒకప్పుడు సౌత్‌లో సెన్సేషనల్ హీరోయిన్ గా కొనసాగింది. స్టార్ హీరోలకు దీటుగా తన సినిమాలతో అలరించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆమె నటించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. 2000లో విడుదలైన మలయాళ చిత్రం ‘కిన్నర తుంబికల్’ ఆరు భాషల్లో డబ్ అయ్యింది. కేవలం రూ. 12 లక్షల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమ ఏకంగా రూ. 4 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
Read Also: మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కల్లోలం, 17 కేసులు నమోదు.. పలువురు రాజీనామా