Kerala Film Industry: మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కల్లోలం, 17 కేసులు నమోదు.. పలువురు రాజీనామా
హేమ కమిటీ రిపోర్టు తర్వాత కేరళ సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులపై లైంగిక వేధింపులు కేసులు నమోదు కాగా, పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
![Kerala Film Industry: మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కల్లోలం, 17 కేసులు నమోదు.. పలువురు రాజీనామా Hema committee report sexual abuse allegations rock Kerala film industry Kerala Film Industry: మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కల్లోలం, 17 కేసులు నమోదు.. పలువురు రాజీనామా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/cda4f2c43a6329c1ff550ddb05a7918e1724923949459544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sexual Abuse Allegations In Kerala Film industry: లైంగిక వేధింపుల ఆరోపణలతో మలయాళీ సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది. మాలీవుడ్ లో మహిళా నటులు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు సంచలనం రేపింది. మలయాళంతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలో ఈ నివేదిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హేమ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాము గతంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడిస్తున్నారు. ఇండస్ట్రీలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న చాలా మంది లైంగిక వేధింపుల వ్యవహారంలో బయటకు వస్తున్నారు.
సినీ ప్రముఖులపై మిను మునీర్ సంచలన ఆరోపణలు
హేమ కమిటీ రిపోర్టు తర్వాత మలయాళీ నటి మిను మునీర్ తొలిసారి బయటకు వచ్చారు. నటులు జయసూర్య, ముఖేష్, మణియం పిళ్ల రాజు, ఇడవేల బాబు తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపించారు. ఓ సినిమా షూటింగ్ లో ఉండగా జయసూర్య తనను వాటేసుకుని ముద్దులు పెట్టాడని ఆరోపించారు. తనకు సహకరిస్తే మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపించారని వెల్లడించారు. అటు అమ్మ సభ్యత్వం ఇప్పిస్తానని చెప్పి ఇడవెల బాబు తన ఫ్లాట్ కు పిలిపించుకుని శారీరకంగా వేధించాడని ఆరోపించారు. అమ్మ(AMMA) సభ్యత్వం కోసం సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ ను సంప్రదిస్తే ఆయన కూడా తనను లైంగికంగా సహకరించాలని కోరాడని వెల్లడించారు. వారి వేధింపులను తట్టుకోలేక చెన్నైకి వెళ్లిపోయినట్లు చెప్పింది. మిను ఫిర్యాదు ఆధారంగా ముఖేష్, జయ సూర్యతో పాటు మణియం పిళ్ల రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘అమ్మ’ అధ్యక్షుడు సహా 17 మంది రాజీనామా
నటి రేవతి సంపత్ సైతం నిర్మాత సిద్ధిఖీ, తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఆమె ఆరోపణల నేపథ్యంలో మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిఖీ రాజీనామా చేశారు. నిజానికి సిద్ధిఖీపై 2016లోనే అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ నటి ఆరోపించడం పోలీసులు కేసు ఫైల్ చేశారు. అటు నటుడు రియాజ్ ఖాన్ అర్థరాత్రి ఫోన్ చేసి అమ్మాయిలను పంపించాలని కోరాడని చెప్పింది. నీకు ఇష్టమైన పొజిషన్ ఏంటని అడగాడని వెల్లడించింది. బెంగాలీ నటి శ్రీలేఖ దర్శకుడు రంజిత్ బాల కృష్ణన్ పై ఆరోపణలు చేసింది. ఆడిషన్ కోసం పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో ఆయన కేరళ సినీ అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు అధ్యక్షుడు మోహన్ లాల్ తో సహా 17 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఇప్పటి వరకు 17 మందికి పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
మున్ముందు మరింత సంచలనంగా మారే అవకాశం
మొత్తంగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత వరుసగా కేసులు ఫైల్ అవుతున్నాయి. ఈ వ్యవహారం మలయాళీ ఇండస్ట్రీలో మరింత సంచలనాలు రేకెత్తించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అన్ని సినిమా పరిశ్రమలలో లైంగిక వేధింపులపై విచారణకు జస్టిస్ హేమ కమిటీ లాంటి కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Also: అర్థరాత్రి ఫోన్ చేసి నాతో పడుకుంటావా అన్నాడు.. ‘తులసి’ నటుడు రియాజ్‌పై నటి రేవతి ఆరోపణలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)