Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
స్లాపూర్కే నాగోబా మహా పూజలకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టి నేటి నుంచి ఛకడ వాహనంపై 7 రోజుల పాటు నాగోబా ప్రచార రథయాత్ర మొదలుపెట్టారు.

Nagoba Jatara 2026 | మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా మహా పూజలకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకొని 2026 జనవరి 18న కేస్లాపూర్ నాగోబా జాతర నిర్వహించనున్న సందర్భంగా సోమవారం రాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెస్రం వంశీయులు ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామానికి చేరుకొని నాగోబా మురాడి దేవస్థానంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మెస్రం వంశీయుల పటేల్ కేస్లాపూర్ నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి సాంప్రదాయం ప్రకారం నెలవంకను దర్శించుకునీ, నాగోబాకు పూజలు నిర్వహించారు.

మద్యం, మాంసాలకు దూరంగా..
ఆదివాసీలకు పవిత్ర మాసం ఈ పుష్యమాసం.. కాళ్లకు చెప్పులు ధరించకుండ, మద్యం, మాంసాలకు దూరంగా ఉంటూ నెలరోజుల పాటు అత్యంత పవిత్రంగా పుష్యమాసంలో అడవి బిడ్డలు తమ ఆరాధ్య దైవాలను కోలుస్తుంటారు. ఒక్కో గోత్రానికి ఒక్కో రకమైన ఆచారాలు సాంప్రదాయాలు వారి దైవాలు ఉంటాయి. అయితే ఈ మెస్రం వంశీయులకు నాగోబా కుల దైవం. మెస్రం వంశీయులలోనూ భుయ్ గొట్టే మెస్రం వంశీయులు పడియోర్ అని పిలుస్తుంటారు. ఆదివాసీలు తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం సూర్య చంద్రులను దైవాలుగా కోలుస్తారు. అందులో ఒక భాగమే నేలవంక దర్శనం. మాసాలను గుర్తించే దిశగా ఈ నెలవంక సూచిస్తుంది. పుష్యమాసం ప్రారంభంతో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో తమ దైవాలను కోలుస్తుంటారు.
జనవరి 18న పవిత్ర గంగాజలంతో అభిషేకం..
మెస్రం వంశీయులు ప్రతియేటా నాగోబాను పుష్యమాసంలో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ దర్శించుకుంటారు. వచ్చే 2026 జనవరి18న నాగోబాకు పవిత్ర గంగాజలంతో అభిషేకం నిర్వహించి మహాపూజ చేయనున్నారు. మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం కానుంది. అయితే నాగోబాకు అభిషేకం కోసం కావలసిన పవిత్ర గంగాజలం సేకరణ, నాగోబా మహాపూజ, జాతర గురించి 7 గ్రామాల్లో, 7 రోజుల పాటు ప్రచారం నిర్వహించే (ఛకడ) ఎడ్లబండి నాగోబా ప్రచార రథయాత్రను నేడు మంగళవారం ప్రారంభించనున్నారు. నేడు మరోసారి అందరూ మెస్రం వంశీయులు సమావేశమై ఈ నాగోబా ప్రచార రథయాత్ర గురించి రూట్ మ్యాప్ ను తయారు చేసి నాగోబాకు పూజలు చేసి ఛకడ వాహనం ఎడ్లబండిపై నాగోబా ప్రచార రథయాత్ర ప్రయాణం చేయనున్నారు.

7 రోజులపాటు 7 గ్రామాలలో జాతరకు సంబంధించిన కార్యక్రమాలు
7 రోజుల పాటు ఆయా గ్రామాల గుండా ఈ రథయాత్ర కొనసాగుతుంది. ఏడు గ్రామాలలో ఏడు రోజులపాటు నాగోబా జాతర ప్రారంభం గురించి మహాపూజకు కావాల్సిన కుండలు ఇతర వాటి సేకరణ గురించి కార్యాచరణ మొదలుపెడతారు. అనంతరం ఏడు రోజుల తర్వాత తిరిగి కేస్లాపూర్ కు చేరుకొని, నాగోబా అభిషేకం మహాపూజ కోసం కావలసిన పవిత్ర గంగాజలం కోసం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరినదిలో గల హస్తలమడుగు వద్దకు పాదయాత్రగా బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు, మెస్రం చిన్నుపటేల్, బాజీరావు పటేల్, లింబారావ్ పటేల్, కోసు కటోడ, కటోడ హనుమంతరావ్, కోసేరావ్ కటోడ, మెస్రం మనోహర్, గణపతి, దాదారావ్, తిరుపతి, దేవ్ రావ్, సోనేరావ్, నాగనాథ్ లు పాల్గొన్నారు.





















