Rajeev Kanakala: వాటి కోసం మితిమీరి దిగజారిపోతున్నారు - ఇంట్లో పిల్లలు, భార్య మీద కూడా.. రాజీవ్ కనకాల ఆగ్రహం
ట్రోలింగ్స్, మీమ్స్ చేసేవాళ్లు డబ్బుల కోసం ఇంతలా దిగజారుతున్నారని రాజీవ్ కనకాల అన్నారు. తెలుగు వాళ్లు ఇంత దారుణంగా ఉంటారని అనుకోలేదని అన్నారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చి మీడియాతో మాట్లాడారు.
Rajeev Kanakala Comments On Telugu YouTube Troll Channels : ప్రస్తుతం పెరిగిపోతున్న ట్రోలింగ్, మీమ్స్ సంస్కృతిపై యాక్టర్ రాజీవ్ కనకాల ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది తమకు వచ్చే 8, 10 వేల కోసం దిగజారి పోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఇదే అంశంపై డీజీపీకి వినతిపత్రం అందించామని, ఇప్పటికే కొన్ని ఛానెల్స్ ని బ్లాక్ చేయించామని, ఇంకా ముందు ముందు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీజీపీకి వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ఇదే విషయంపై గతంలో మా అసోసియేషన్ అధ్యుక్షుడు మంచు విష్ణు కూడా స్పందించిన విషయం తెలిసిందే.
డబ్బులు కోసం ఇంత దిగజారారు..
"ట్రోలింగ్స్, మీమ్స్ ఈ రోజుల్లో శ్రుతిమించి పోతున్నాయి. నాకు తెలిసి మన తెలుగువాళ్లు ఇంత దారుణంగా తయారు అవ్వడం ఇదే మొదటిసారి. బహుశ కేవలం రూ.8వేలు, 10 వేల కోసం ఇలా చేస్తున్నారు అనుకుంట. దాని కోసమే మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఇది ‘మా’ అసోసియేషన్‌కు మాత్రమే కాదు. జనానికి కూడా మంచిది కాదు. ఒక లెవెల్ వరకు తట్టుకోగలుగుతాం. కానీ, మితిమీరి పోతున్నారు. ఇంట్లో పిల్లల మీదికి, భార్యల మీదికి, ఇంటి పక్కన వాళ్ల మీదకి కూడా పాకుతుంది. ఇది మంచి పరిణామం కాదు. దయచేసి నేను కోరుకుంటుంది ఏంటంటే.. వార్నింగ్ ఇవ్వండి. ఇన్ ఫ్ల్యూయెన్సర్స్, యూట్యూబర్స్ అందరూ కూర్చుని మాట్లాడుకోండి. ఇలా చేయొద్దు అని చెప్పండి. ఇండస్ట్రీ చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. దాన్ని 30 నిమిషాలు, నలుగురితో పెట్టిన ప్రోగ్రామ్‌తో కిందికి లాగేస్తున్నారు. డీజీపీ గారికి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం. కో ఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాం. ఇప్పటికే మా అసోసియేషన్ 25 ఛానెల్స్‌ను టెర్మినేట్ చేయించింది. అవి దిగజారిపోయి రాశాయి. చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆర్టిస్టులు కూడా శ్రుతిమించి వెళ్లిపోకండి. ఎంటర్ టైనింగ్ గా, పక్కన వాళ్లని ఇబ్బంది పెట్టకుండా చేస్తే మంచిది" అని అన్నారు రాజీవ్ కనకాల.
ఇక రాజీవ్ కనకాలతో పాటు యాక్టర్ శివబాలాజీ కూడా డీజీపీని కలిసిన వాళ్లలో ఉన్నారు. ఆయన ట్రోలర్స్ కి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే 25 ఛానెల్స్ ని బ్లాక్ చేయించామని, ఇకపై మరిన్ని ఛానెల్స్ ని బ్లాక్ చేయిస్తామని చెప్పారు శివబాలాజీ. అలాంటి లింక్స్ ఉంటే ఇప్పటికైనా తీసేయాలని, తర్వాత పరిణామాలు దారుణంగా ఉంటాయని అన్నారు ఆయన. ఇటీవల సోషల్ మీడియాలో హనుమంతు అనే వ్యక్తి తండ్రి, కూతుళ్ల బంధంపై తీవ్ర కామెంట్స్ చేశాడు. దీంతో అది అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దానిపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. మంచు విష్ణు ఆ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఆయన. చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడిక యాక్షన్ తీసుకున్నారు.
Also Read: 200 ఛానెల్స్‌పై డీజీపీకి ఫిర్యాదు చేశాం - ట్రోల్స్ చేస్తే సీరియస్ యాక్షన్: శివబాలాజీ మాస్ వార్నింగ్