కృష్ణ కృష్ణా... జైలు జీవితంలో జ్ఞానోదయం అయ్యిందా? మీరు మారిపోయారు సార్!
మీరు మారిపోయారు సార్... ఓ సినిమాలో ఆయన పాపులర్ డైలాగు ఇది. ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తూ వాడుతున్నారు. జైలు జీవితంలో ఆయనకు జ్ఞానోదయం అయ్యిందా? లేదంటే నిజం ఎలా ఉంటుందో తెలిసిందా?

'మీరు మారిపోయారు సార్'... ఒక సినిమాలో ఆయన డైలాగ్ ఎంత పాపులర్ అంటే? క్యారెక్టర్ మార్చుకున్న ప్రతి ఒక్కరి గురించి చెప్పే సమయంలో ఆ డైలాగ్ వాడుతున్నారు. బహుశా ఆయన కూడా ఊహించి ఉండరేమో... తన గురించి ఈ డైలాగు వాడే రోజు ఒకటి వస్తుందని! రెండు వారాల జైలు జీవితంలో ఆయనను చూసిన పోలీసులు, కోర్టులో ఆయన ప్రవర్తన గమనించిన జనాలు 'మీరు మారిపోయారు సార్' అంటున్నారు.
కెమెరా ముందు పులి... జైల్లో పిల్లి!
'వీధిలో పులి ఇంట్లో పిల్లి' అనే సామెత వినే ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో కెమెరా ముందు ఆయన విశ్వరూపం చూసిన జనాలు, ఇప్పుడు జైలులో ఆయన ప్రవర్తన తెలిసిన మనుషులు చెప్పే మాట ఒక్కటే... 'కెమెరా ముందు పులి జైల్లో పిల్లి' అని. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు మీరి ఆయన మాట్లాడిన సందర్భాలు తెలుగు ప్రజలకు ఇంకా గుర్తు. కెమెరా కనిపిస్తే చాలు... ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏం మాట్లాడుతున్నాం? అనేది మరచి మహిళల గురించి తప్పుగా మాట్లాడిన రోజులు ఉన్నాయి.
ఇప్పుడు ఆయన మెడకు మాటలు (తప్పులు) చాలా అంటే చాలా బలంగా చుట్టుకున్నాయి. మర్రిచెట్టు ఊడల్లా పెనవేసుకుపోయాయి. పీకేద్దాం అని ప్రయత్నించినా కుదరడం లేదు. కేసులు బలంగా ఉండటంతో జైలులో రెండు వారాలు గడపాల్సి వచ్చింది. దాంతో మనిషి బాగా కృంగిపోయాడని సమాచారం. కోర్టులో వెక్కి వెక్కి ఏడ్చినట్టు వార్తలు వచ్చాయి. కోర్టులో కంటే ముందు జైలులో ఏడ్చిన సందర్భాల్లో ఉన్నాయట. దాంతో 'కెమెరా ముందు పులి జైల్లో పిల్లి' అని ఆయన గురించి 'ఆఫ్ ది రికార్డ్' గుసగుసలు వినబడుతున్నాయి.
రచయితగా అనుభవం ఏమైంది?
అసలు ఆ ఒక్క లాజిక్ ఎలా మరిచిపోయారు!?
రచయితగా ఆయనకు వందల సినిమాలు రాసిన అనుభవం ఉంది. నటుడిగానూ చాలా సినిమాలు చేశారు. ఐదు పదుల జీవితాన్ని చూశారు. అదంతా ఏమైందో ఏమో... అధికారం ఎవరి శాశ్వతం కాదని గుర్తించలేకపోయారో ఏమో?
ఒక పార్టీకి, ఒక నాయకుడికి మద్దతు పలకడం తప్పు కాదు. అది వ్యక్తిగతం. రాజకీయాలలో పార్టీలు మారడం, తమ తమ అభిమాన నాయకులను మార్చడం సహజం. హీరోలు విలన్లు ఎవరూ లేరు ఈ నాటకంలో అని చెప్పినట్టు పరిస్థితులకు తగ్గట్టు చాలా మంది మారుతూ ఉంటారు. ఏ గట్టున ఉన్నా సరే నోరు అదుపులో పెట్టుకోవడం ముఖ్యం కదా!
'వడ్డించే వాడు మనవాడు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు' అనేది ఒక సామెత. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది. ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని లాజిక్ మర్చిపోతే ఎలా!? అందుకు చక్కటి ఉదాహరణ తాజా అరెస్ట్ అనేది రాజకీయ వర్గాలలో సైతం చర్చకు వస్తోంది.
జైలు జీవితం సినిమాలలో చూపించినట్లు ఉండదని ఆయనకు బాగా అర్థం అయ్యిందట. కానిస్టేబుల్ క్యారెక్టర్ చేయడం వేరు, జైలులో ఉన్నప్పుడు కానిస్టేబుల్స్ మన పట్ల ప్రవర్తించే విధానం వేరని తెలిసి వచ్చిందట. దాంతో వెక్కి వెక్కి ఏడ్చినట్లు, గుక్క పెట్టినట్లు తెలుస్తోంది. రెండు వారాల జైలు జీవితం ఆయనలో జ్ఞానోదయం కలిగించిందో లేదో గానీ... మెంటల్ కృష్ణ మెంటల్లీ వెరీ వీక్ అంటున్నారు దగ్గర్నుంచి చూసిన జనాలు.
కెమెరా ముందు మాట్లాడడం వేరు, మనల్ని ప్రశ్నించే వ్యక్తులు లేనప్పుడు ఇష్టం వచ్చినట్లు చెప్పడం వేరు... కేసులతో కోర్టుల చెట్టు తిరగడం వేరు, పోలీసులతో పాటు న్యాయమూర్తులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వేరు. లాజిక్స్, లా పాయింట్స్ బయటకు తీసి ప్రశ్నలు అడుగుతుంటే బిక్క మొహం వేసే బదులు... ఆయనను చూసి కెమెరా ముందు రెచ్చిపోయే జనాలు ముందు జాగ్రత్త పడడం మంచిదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆయన నిజంగా మారిపోయారా? లేదంటే బెయిలు బయటకు రావడం కోసం తనలో ఉన్న నటుడిని బయటకు తీసి నిజమనేట్టు నమ్మించారా!? వెయిట్ అండ్ సీ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

