Tarakaratna: మార్చి 2న తారకరత్న పెద్దకర్మ, పనులు పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ, విజయసాయిరెడ్డి
నటుడు నందమూరి తారకరత్న(40) పెద్ద కర్మ మార్చి 2న జరగనుంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమ పనులను బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు.
గుండె పోటుతో చికిత్స పొందుతూ చనిపోయిన నందమూరి తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమాలు, మార్చి 2న జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, నందమూరి బాలకృష్ణ, ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులతో చర్చించారు.
పనులను పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ, విజయసాయిరెడ్డి
తారకరత్న పెద్ద కర్మకు సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు, తారకర్న అభిమానులు, నందమూరి అభిమానులు, టీడీపీ మద్దతుదారులందరికీ సమాచారం ఇవ్వడం మొదలుకొని, బందోబస్తు ఏర్పాటు వరకు అన్ని పనులను బాలకృష్ణ, విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తారకరత్న ఆసుపత్రిలో చేరిన సమయంలో, ఆయన మరణం తర్వాత అంత్యక్రియల సందర్భంగా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి దగ్గరుండి పనులను చూసుకున్నారు. తమ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అలేఖ్య రెడ్డి, ఆమె పిల్లలకు ధైర్యం చెప్తూ వచ్చారు. ఆ తర్వాత జరగాల్సి కార్యక్రమాలను సైతం తారకరత్న తరఫున బాలయ్య, అలేఖ్య తరఫున విజయసాయి చూసుకుంటున్నారు.
ఫిబ్రవరి 18న చికిత్స పొందుతూ తారకరత్న కన్నుమూత
నందమూరి తారకరత్నశనివారం(ఫిబ్రవరి 18) రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తారకరత్నను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి మరింత విషమించడంతో అదే రోజు రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు అరగంట పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. విదేశీ వైద్య బృందం సైతం ఆయన ప్రాణాలు కాపాడేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. అయినా, కాపాడలేకపోయారు. 23 రోజుల చికిత్స అనంతం శనివారం రాత్రి తారకరత్న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
తారకరత్న భార్య ఎమోషనల్ పోస్టు
తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టారు. తమ జీవితం పూల బాట కాదని, కార్లలో నిద్ర పోయిన రోజులు కూడా ఉన్నాయని అలేఖ్య తన పోస్టులో వెల్లడించారు. తమను తారకరత్న ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదని అందులో రాశారు. ’’మనం కలిసి ఉండటానికి పోరాడాం. చివరి వరకు పోరాడుతూనే ఉన్నాం. మనం అంత సులభమైన జీవితం బతకలేదు. కార్లలో నిద్ర పోయిన రోజుల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం చాలా దూరం ప్రయాణించాం. నువ్వొక యోధుడివి. మమ్మల్ని నువ్వు ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేదు’’ అని రాసుకొచ్చారు. తారకరత్న చేతిని తాను పట్టుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు.
View this post on Instagram
తాతయ్య ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. అయితే, ఆశించిన రీతిలో ఆయన విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం 'అమరావతి'తో రాష్ట్ర పురస్కారం నంది అందుకున్నారు. సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ '9 అవర్స్'లో సీఐ రోల్ చేశారు. హీరోగా 'ఒకటో నంబర్ కుర్రాడు', 'యువ రత్న', 'భద్రాద్రి రాముడు', 'నందీశ్వరుడు' తదితర చిత్రాలు చేశారు. అయితే, ఇటీవల నటన కంటే ఎక్కువ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
Read Also: విడాకుల తర్వాత తొలిసారి సామ్ ఫోటో షేర్ చేసిన చైతన్య, సమంత మాత్రం?