Sundeep Kishan: ‘హనుమాన్’ కోసం వెనక్కి తగ్గాం, ‘ఈగల్’ విషయంలో క్లాష్ తప్పట్లేదు: సందీప్ కిషన్
Sundeep Kishan: రవితేజ ‘ఈగల్’తో సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవ కోన’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు.
Sundeep Kishan About Eagle movie: సందీప్ కిషన్, వి.ఐ ఆనంద్ కాంబోలో వస్తున్న తాజాగా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా హైదరాబాద్ లో విడుదల అయ్యింది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ సినిమా విడుదలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమ సినిమాతో పాటు రవితేజ ‘ఈగల్’ మూవీ కూడా విడుదల కావడంపై స్పందించారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి తమకు ఎవరి నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని వెల్లడించారు.
రిలీజ్ డేట్ వాయిదా వేయలేం- సందీష్ కిషన్
నిజానికి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘ఈగల్’కు సోలో డేట్ ఇస్తామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు సినీ నిర్మాతల మండలి రీసెంట్ గా ప్రకటించాయి. అయితే, ఇప్పుడు ఆ సినిమాతో పాటు ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “నిజం చెప్పాలంటే.. మేం సంక్రాంతికే సినిమా విడుదల చేయాలి అనుకున్నాం. అయితే, చాలా సినిమాలు పోటీ పడటంతో అప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడం మంచిది కాదు అనుకున్నాం. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలి అనుకున్నాం. ఫిబ్రవరి 9న ‘టిల్లు స్క్వేర్’ను ప్రకటించారు. మేము వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. ఈ సమయంలో మళ్లీ డేట్ మార్చే అవకాశం లేదు. ఇప్పటికే ఎంతో టైమ్ తీసుకున్నాం. రవితేజను నేను అభిమానిస్తాను. దర్శకుడు వి.ఐ.ఆనంద్ గత చిత్రం రవితేజతోనే చేశారు. ‘ఈగల్’ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మా నిర్మాతకు మంచి సంబంధాలు ఉన్నాయి. ‘ఈగల్’ రిలీజ్ డేట్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. ఒకవేళ వాళ్లు మాకు ఫోన్ చేసి మాట్లాడితే స్పందించేవాళ్లం” అని చెప్పుకొచ్చారు.
‘హనుమాన్’ టీమ్ కు అభినందనలు
అటు ‘హనుమాన్’ మూవీ సక్సెస్ పైన సందీప్ కిషన్ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటుడు తేజ సజ్జను అభినందించారు. “హనుమాన్’ సక్సెస్ కావడం పట్ల నేను ఎంతో సంతోషించాను. నమ్మిన ప్రాజెక్టు కోసం ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ మూడు ఏండ్లు కష్టపడ్డారు. ప్రతి సినిమా ‘హనుమాన్’ అవుతుంది అని నేను అనను. కానీ, ప్రయత్నం వారి మాదిరిగా ఉండాలి. ‘హనుమాన్‘తో అద్భుత విజయాన్ని అందుకున్న ఆ చిత్రబృందానికి అభినందనలు” అని చెప్పారు.
ఫిబ్రవరి 9న విడుదల
వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించారు. సందీప్ కిషన్ సరసన కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, శుభోదయం సుబ్బారావు, ఖుషి రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. హారర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: జంతువుల్లా ప్రవర్తిస్తారు - బాలీవుడ్ పై 'యానిమల్' డైరెక్టర్ సందీప్ వంగా షాకింగ్ కామెంట్స్!