New DGP: ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా - ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
Andhrapradesh News: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది.
EC Appointed Harish Kumar Gupta As New DGP: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. కాగా, వరుస ఫిర్యాదులతో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. కొత్త డీజీపీ కోసం ముగ్గురి పేర్లు పంపించాలని ఆదివారం ఎన్నికల సంఘం (Election Commission) సీఎస్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను కొత్త పోలీస్ బాస్ పోస్ట్ కోసం సిఫార్సు చేసింది. వీరిలో హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. 1992వ బ్యాచ్ కు చెందిన హరీష్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. కాగా, ద్వారకా తిరుమలరావు 1990వ బ్యాచ్ కు చెందిన వారు కాగా, మాదిరెడ్డి ప్రతాప్ 1991వ బ్యాచ్ కు చెందినవారు.