Congress Wins Jangaon and Thorrur: లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
Congress Wins Jangaon Municipality | లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశ ఎదురైంది. రెండు రోజుల సస్పెన్స్ తరువాత నిర్వహించిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీడ్రా ద్వారా కాంగ్రెస్ విజయం సాధించింది.

జనగామ/ తొర్రూర్: రెండు రోజుల హైడ్రామా తరువాత జరిగిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపాలిటీ కోసం జరిగిన ఓటింగ్ లో రెండు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో నిర్వహించిన లక్కీ డ్రాలో కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
లక్కీడ్రాలో జనగామ మున్సిపాలిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్
జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో గత రెండు రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ జనగామ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS) అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మెజార్టీ తేల్చేందుకు ఓటింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి 16 ఓట్లు రాగా, బిఆర్ఎస్ అభ్యర్థి గోపగొని సుగుణాకర్‌కు కూడా సరిగ్గా 16 ఓట్లు వచ్చాయి. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో (టై కావడంతో), ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం 'డ్రా' ప్రక్రియ పాటించారు. ఈ లక్కీ డ్రాలో అదృష్టం కాంగ్రెస్ పార్టీని వరించింది. దీంతో జనగామ మున్సిపల్ చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కడకంచి బాలమణి ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
లక్కీడ్రాలో తొర్రూర్ లో కాంగ్రెస్ విజయం
తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థికి సమానంగా ఓట్లు రావడంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల అధికారి డ్రా పద్ధతిలో విజేతను నిర్ణయించారు. డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దాంతో తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా తూణం శ్రవణ్ ఎన్నికైనట్లు ప్రకటించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ కడియం కావ్య అక్రమంగా ఓటు వేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఎంపీకి అక్రమ ఓటు వేసే హక్కు ఎక్కడిదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మాజీ మంత్రి ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ఆయనను నరసింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎర్రబెల్లిని అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కాగజ్ నగర్ కాంగ్రెస్ కైవసం.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాయి
బీజేపీ మద్దతుతో కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 09+ బీజేపీ 03+ ఇండిపెండెంట్ 02 + ఇద్దరు ఎక్స్ అఫిషియో లతో కలిపి కాంగ్రెస్ అభ్యర్థి షాహీన్ సుల్తానా విజయం సాధించారు.

బీఆర్ఎస్ అభ్యర్థికి 15 మంది కౌన్సిలర్ల మద్దతు తెలపగా.. ఒక ఓటు అధిక్యంతో కాంగ్రెస్ కాగజ్‌నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ ఓట్ల మద్దతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. వైస్ చైర్మన్‌గా కొత్తపల్లి అనిత (బీజేపీ) ఎన్నికయ్యారు.
























