Software Engineer Suicide: రెండు నెలల్లో అమెరికాకు, అంతలోనే ఏ కష్టం వచ్చిందో బావిలో దూకి సూసైడ్
Khammam News: ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లికి చెందిన దావులూరి వర్షిత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. సోమవారం ఇంటి ఆవరణలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Khammam Crime News: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, మంచి జీతం, మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఏ కష్టం వచ్చిందో బావిలో దూకి బలన్మరణం చెందింది. కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపునేనిపల్లికి చెందిన దావులూరి వర్షిత (24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. గత ఫిబ్రవరి 14న తిరువూరు మండలం ఎరుకుపాడు గ్రామానికి చెందిన యువకుడితో వర్షిత వివాహం జరిగింది. ఉన్నత చదువుల కోసం ఆమె భర్త పెళ్లైన నాలుగు రోజులకే అమెరికా వెళ్లారు.
గత కొద్ది కాలంగా వర్షిత అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. తరచూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన సమస్యను చెప్పుకునేది. ఆమె బాధ చూడలేకపోయిన తండ్రి కిరణ్ కుమార్ ఈనెల 26న ఇంటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వర్షిత తల్లిదండ్రులతో కలిసి నిద్రించింది. తెల్లవారుజామున కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలించగా.. ఇంటి ఆవరణలోని బావిలో శవమై కనిపించింది. అనారోగ్య సమస్యలతోనే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో రెండు నెలల్లో అమెరికాకు
కిరణ్ కుమార్, ప్రసన్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వర్షిత పెద్ద కుమార్తె. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లేందుకు వర్షిత అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం భర్త అమెరికాలో ఉండటం, తాను కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కావడంతో వీసా పనులు అన్నీ పూర్తి చేసుకున్నారు. జులైలో అమెరికా వెళ్లానని తల్లిదండ్రులు, అత్తమామలకు తెలిపింది. ఈ క్రమంలో వర్షిత ఆత్మహత్య చేసుకుని ఆ రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.