Viral News: ఉబర్ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువతి, పెప్పర్ స్ప్రేతో అటాక్ - వీడియో
Viral Video: అమెరికాలో ఓ మహిళ ఉబర్ డ్రైవర్‌పై దారుణంగా అటాక్ చేసింది. పెప్పర్ స్ప్రేతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral News in Telugu: అమెరికాలోని మన్‌హట్టన్‌లో ఓ మహిళ ఉబర్ డ్రైవర్‌పై దారుణంగా దాడి చేసింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పెప్పర్ స్ప్రేతో డ్రైవర్‌పై దాడికి దిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఇలా అటాక్ చేసింది. కార్‌లో నుంచి తప్పించుకుని పారిపోదామని ప్రయత్నించినా వదలకుండా పెప్పర్ స్ప్రే కొట్టింది. చేసేదేమీ లేక దాడి చేయొద్దంటూ వేడుకున్నాడు బాధితుడు. ఎలాగోలా అక్కడి నుంచి కాసేపటికి తప్పించుకున్నాడు. దాడి చేసిన యువతితో పాటు మరో యువతి కూడా కార్‌లో ఉంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణించి కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచనున్నారు. అయితే..డ్రైవర్‌పై ఎందుకు దాడి చేసిందన్నది మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు ప్రస్తుతానికి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దాడి తరవాత ఉబర్ ఆ యువతిపై నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఎప్పుడూ మళ్లీ తమ సర్వీస్‌లను వినియోగించుకోడానికి వీల్లేకుండా బ్యాన్ చేసింది. ఈ మేరకు అధికారకంగా ఓ ప్రకటన చేసింది.
"డ్రైవర్‌పై దాడి చేసిన తీరు ఆందోళన కలిగించింది. ఇది ఏ మాత్రం సరికాదు. హింసను మేము ఉపేక్షించం. ఉబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ యువతిని బ్యాన్ చేస్తున్నాం. విచారణలో భాగంగా పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తాం"
- ఉబర్
NYC
— The Daily Sneed™ (@Tr00peRR) August 2, 2024
Woman randomly maces Uber driver ‘because he's brown’ pic.twitter.com/GKHBkBvESr
ఈ దాడిపై స్థానికులూ తీవ్రంగా మండి పడుతున్నారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలని అధికారులకు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఈ తరహా ఘటనలు జరిగాయి. చిన్న విషయానికే తగాదా పడి డ్రైవర్‌పై దాడి చేస్తున్నారు.