Vizianagaram Youth Dies: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం, కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి
Vizianagaram Youth Dies while playing Kabaddi: విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ పోటీలలో పాల్గొన్న ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది.
Vizianagaram Youth Dies while playing Kabaddi Game : నూతన సంవత్సరం అనగానే ఎన్నో కొత్త ఆశలతో ఉంటారు. గత ఏడాది సాధించలేనిది, సాధ్యం కానివి ఎలాగైనా నూతన సంవత్సరంలో సాధించాలని కలలు కంటారు. అయితే విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ పోటీలలో పాల్గొన్న ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా కబడ్డీ ఆడిన యువకుడు ఇక తమ మధ్య లేడంటూ తోటి ఆటగాళ్లు, కుమారుడి మరణంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
అసలేం జరిగిందంటే..
నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు కొన్నిచోట్ల పరుగు పందెలు, ఎడ్ల పందెలు, కబడ్డీ, సింగింగ్ కాంపిటీషన్ ఇలా తోచిన విధంగా ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి నెలకొంది. పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేశారు. చుట్టుపక్కల గ్రామాల జట్లు సైతం కబడ్డీ పోటీలో పాల్గొన్నాయి. కొవ్వాడ, ఎరుకొండ, యోరుకొండ, అగ్రహారం గ్రామాల జట్లు పాల్గొన్నాయి. కొవ్వాడ - ఎరుకొండ జట్లు కబడ్డీ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ క్రమంలో ఎరుకొండ గ్రామానికి చెందిన రమణ అనే యువకుడు కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడు. రమణ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్త స్రావమైనట్లు కొందరు చెబుతుండగా.. ఇంటర్నల్ గా ఏదో జరిగిందని మరికొందరు స్థానికులు తెలిపారు. కబడ్డీ పోటీల నిర్వాహకులు, స్థానికులు చికిత్స నిమిత్తం రమణను విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. కానీ డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూనే రమణ మృతి చెందాడు. తమ కుమారుడు చనిపోవడంతో రమణ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భీమిలీ కబడ్డీ సినిమా తరహాలో యువకుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కొవ్వాడ, ఎరుకొండ జట్లు కబడ్డీ టోర్నీ ఫైనల్ చేరుకున్నాయి. ఫైనల్ ఆడుతుండగా కొందరు ఆటగాళ్లు అందరూ ఒక్కసారిగా రమణ మీద పడిపోయారు. దీంతో యువకుడు ఊపిరాడక అపస్మారక స్థితికి వెళ్లాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన కుమారుడు చనిపోయాడని, దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. రూ.500 బెట్టింగ్ వేసి మ్యాచ్‌లు నిర్వహించారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆటలో ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడాన్ని స్థానికులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.
గతంలో కడప జిల్లాలో ఇదే తీరుగా...
కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేటకు చెందిన పెంచలయ్య, జయమ్మల చిన్నకుమారుడు నరేంద్ర ఎం.కాం చదువుకున్నాడు. వల్లూరు మండలం గంగాయపల్లెలో జరిగిన నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో కూతకు వెళ్లిన యువకుడు నరేంద్రను ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు టాకిల్ చేశారు. పాయింట్ కోల్పోయాక తిరిగి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు నరేంద్ర. చికిత్స నిమిత్తం హుటాహుటీన ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.