Vizag Murders: మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ, నడ్డిరోడ్డుపై రౌడీషీటర్ హత్య!
Vizag Murders: విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో రౌడీ షీటర్ ను నడిరోడ్డుపైనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతుడు కాకినాడ రౌడీ షీటర్ అనిల్ గా గుర్తించారు.
Vizag Murders: విశాఖపట్నం వాసులకు వరుస హత్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెల్లవారుజామున లేవగానే ఎక్కడ ఎలాంటి హత్య కేసులు వినాల్సి వస్తుందోనన్న భయం వారిలో నెలకొంది. మొన్నటి వరకు సైకో కిల్లర్ మహిళలనే టార్కెట్ చేసుకుని హత్యలు చేశాడు. ఆ భయం నుండి ఇంకా బయట పడక ముందే మరో కలకలం రేగింది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వ్యక్తి కాకినాడ రౌడీ షీటర్ అని పోలీసులు తేల్చారు.
రౌడీషీటర్ దారుణ హత్య
విశాఖపట్నంలో బుధవారం సాయంత్రం నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ రౌడీ షీటర్ హత్య జరిగింది. ఇద్దరు యువకులు రౌడీ షీటర్ ను కత్తి పొడిచి, గొంతు కోసి దారుణంగా ప్రాణాలు తీశారు. అయితే హంతకులు, మృతుడు స్నేహితులేనని, వారిలో వారి అంతర్గత ద్వేషాలు చంపుకునే వరకు వెళ్లాయని పోలీసులు భావిస్తున్నారు. రౌడీ షీటర్ ను అతడి స్నేహితులే చంపారని చెప్పారు పోలీసులు.
విశాఖపట్నంలోని అప్పుఘర్ కు చెందిన అనిల్ కుమార్ పేరుకు కారు డ్రైవర్ అయినప్పటికీ అతడో రౌడీ షీటర్. ఎంవీపీ కాలనీ ఆదర్శ నగర్ కు చెందిన శ్యామ్ ప్రకాశ్, అనిల్ కుమార్ స్నేహితులు. శ్యామ్ ప్రకాశ్ బస్సు డ్రైవర్ కాగా అతడిపై 498ఎ కేసు ఉంది. అయితే వీరి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోందని అంటున్నారు. శ్యామ్ ప్రకాశ్ గురించి అనిల్ కుమార్ హేళనగా మాట్లాడుతున్నాడని తెలుసుకున్నాడు శ్యామ్. అలా అతడిపై కోపాన్ని పెంచుకున్నాడు. ఆ కోపం వల్ల తరచూ గొడవలు పడే వారు. కొన్ని రోజుల క్రితం క్రికెట్ ఆడుతుండగా.. అనిల్ కుమార్, శ్యామ్ ప్రకాశ్ గొడవ పడ్డారు. కొట్టుకునే వరకూ వెళ్లగా చుట్టు పక్కల వారు ఇద్దరినీ ఆపి, రాజీ కుదిర్చారు.
కత్తులతో పొడిచి హత్య
బుధవారం పగలు ఉషోదయ కూడలిలోని అనుపమ బార్ లో శ్యామ్ ప్రకాశ్, అనిల్ కుమార్, షమీర్, ఎర్రయ్య నలుగురు కలిసి మద్యం సేవించారు. తాగుకుంటూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. మాటా మాటా పెరగడంతో వారి మధ్య గొడవ జరిగింది. సాయంత్రం తాగి బయటకు రాగా.. మరోసారి వాగ్వాదం జరిగింది. అనిల్ తో జరిగిన గొడవలో ఒకరినొకరు తోసేసుకున్నారు. పరస్పరం కొట్టుకున్నారు. ఆ తర్వాత శ్యామ్ ప్రకాశ్, మరొకరు కలిసి అనిల్ ను తీవ్రంగా కొట్టారు. మద్యం మత్తులో ఉన్న వారంతా విచక్షణా రహితంగా అనిల్ పై కత్తులతో దాడి చేశారు. ఇద్దరు కలిసి కత్తులతో అనిల్ ను ఇష్టారీతిగా పొడిచారు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా పట్టించుకోలేదు. తర్వాత గొంతు కోసి అక్కడి నుండి పరారు అయ్యారు. అనిల్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
తరచూ గొడవ పడే అనిల్..
అనిల్ కుమార్ రౌడీ షీటర్ కావడంతో తరచూ స్థానిక యువకులతో గొడవ పడే వాడు. అనిల్ వ్యవహారం శ్యామ్ ప్రకాశ్ కు తరచూ కోపం తెప్పించేది. హత్య జరిగిన రోజు కూడా అనిల్ కుమార్ వ్యవహారం నచ్చకనే, ఆవేశంలో శ్యామ్ ప్రకాశ్ మరో వ్యక్తి అతనిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా పక్కా పథకం ప్రకారం చేశారా.. లేదా అప్పటికప్పుడు వచ్చిన ఆవేశాన్ని అణచుకోలేక కత్తులతో దాడి చేసి హతమార్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.