Vijayawada: సోఫాలో నిద్రపోతున్న అన్న, కూరగాయల కత్తితో కడుపులో పొడిచిన తమ్ముడు - కారణం ఏంటంటే
Vijayawada: అమ్మా నాన్నలపై తన అన్న చేయి చేసుకునేవాడు. తరచూ గట్టిగా అరుస్తూ ఇంట్లో సామగ్రిని ఇష్టమొచ్చినట్లు పడేయడం, పగలగొట్టడం వంటివి చేసి బాగా విసిగించేవాడు.
Brother Murder in Vijayawada: విజయవాడలో ఓ తమ్ముడు సొంత అన్నను దారుణంగా చంపేశాడు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అయోధ్య నగర్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో సొంత సోదరుడినే తమ్ముడు హతమార్చాడు. పోలీసుల వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. అజిత్ సింగ్ పీఎస్ పరిధిలోని అయోధ్య నగర్‌లో రైల్వేశాఖలో గార్డుగా పనిచేస్తున్న వర ప్రసాద్ పని చేస్తున్నాడు. అతని భార్య ఉమామహేశ్వరి. వీరికి ఇద్దరు కొడుకులు హర్షత్ యాదవ్(23), పార్ధివ్ యాదవ్(19) ఉన్నారు. అన్న హర్షత్ బీటెక్ చదువుతుండగా... తమ్ముడు పార్ధివ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేస్తున్నాడు.
అయితే, చాలా కాలంగా హర్షత్ రోజూ తన తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. అంతేకాకుండా అమ్మా నాన్నలపై చేయి కూడా చేసుకునేవాడు. తరచూ గట్టిగా అరుస్తూ ఇంట్లో సామగ్రిని ఇష్టమొచ్చినట్లు పడేయడం, పగలగొట్టడం వంటివి చేసి బాగా విసిగించేవాడు. బలవంతంగా వారి నుంచి డబ్బులు తీసుకొని, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుండేవాడు. ఈ పరిస్థితుల్లో తన తల్లిదండ్రులను అన్న ఇబ్బందులు పెడుతుండడం చూసిన తమ్ముడు అతణ్ని వదిలించుకోవాలని సంవత్సరం క్రితమే నిర్ణయించాడు. కానీ, తన అన్న మారతాడని, చాలా కాలం వేచి చూశాడు.
తన అన్న ప్రవర్తన రోజు రోజుకీ మరీ శ్రుతి మించడంతో చివరికి హత్య చేసేశాడు. శుక్రవారం (మార్చి 4) మధ్యాహ్నం వేళ తన అన్న హర్షత్ ఇంట్లోని హాలులో సోఫాలో పడుకొని ఉండగా.. వంట గదిలోని కూరగాల చాకు తీసుకొచ్చి పొట్టలో పొడిచేశాడు. అనంతరం ఛాతిలోనూ కత్తిపోట్లు పెట్టాడు. దీంతో వెంటనే హర్షత్ యాదవ్ (Brother Murder) చనిపోయాడు. హత్య తర్వాత అతణ్ని పొడిచిన కూరగాయల చాకును ఇంట్లోనే బెడ్ రూమ్ కబోర్డులో పార్ధివ్ దాచాడు. ఈ హత్య ఘటన సమయంలో పెద్ద పెద్దగా ఇంట్లోంచి గట్టిగా అరుపులు వచ్చాయి. దీంతో చుట్టుపక్కల వారు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
అజిత్ సింగ్ నగర్ (Ajit Singh Nagar) పోలీసులు ప్రాథమికంగా లభించిన ఆధారాల మేరకు తల్లిదండ్రులను వేధిస్తుండడం చూసి తట్టుకోలేక బాధతో పార్ధివ్ తన అన్న హర్షత్‌ను చంపేసినట్లుగా గుర్తించారు. హత్యకు వాడిన కూరగాలు కోసే చాకును స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గవర్నమెంటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.