Kolkata: కోల్‌కత్తా డాక్టర్ డైరీలో ఏం రహస్యాలున్నాయి? చిరిగిపోయిన పేజీయే కీలక సాక్ష్యం కానుందా?
Kolkata Doctor: కోల్‌కత్తా డాక్టర్ కేసులో ఆమె డైరీయే కీలకం కానుంది. ఓ పేజీలో ఆమె ఏదో రాసుకుని ఆ తరవాత చించేసినట్టు విచారణలో తేలింది.
Kolkata Doctor's Diary: కోల్‌కత్తా డాక్టర్ కేసులో ఆమె డైరీ కీలకం కానుంది. ఇప్పటికే బాధితురాలి తండ్రి ఈ డైరీ గురించి ఓసారి ప్రస్తావించారు. ప్రతిదీ అందులో రాసుకోవడం ఆమెకి అలవాటు అని చెప్పారు. అంతే కాదు. ఎమ్‌డీ ఎగ్జామ్‌లో టాపర్ అవ్వాలని, గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని డైరీలో రాసుకుందని అన్నారు. అయితే...ఇదే డైరీలో మరికొన్ని కీలక విషయాలనూ ఆమె రాసినట్టు తెలుస్తోంది. పైగా ఆ రాసిన పేజీని ఆమె చింపేసింది. ఆ పేజీ ఇప్పుడు బాధితురాలి తండ్రి వద్దే ఉంది. ఈ కేసుని విచారిస్తున్న సీబీఐకి ఇదే కీలక ఆధారం కానుంది. ఇప్పటికే సీబీఐకి ఆ పేజ్‌ని ఇచ్చారు బాధితురాలి తండ్రి. కానీ అందులో ఏం రాసుంది అన్నది మాత్రం మిస్టరీగానే ఉంది. ఈ వివరాలేవీ బయటపెట్టకూడదని సీబీఐ అధికారులు బాధితురాలి తండ్రితో చెప్పారు. అందుకే ఆయన కూడా ఎక్కడా ఈ వివరాలు చెప్పడం లేదు. అయితే...రోజూ తన బ్యాగ్‌లో ఆ డైరీ పెట్టుకుని వెళ్లేది. కొన్ని సార్లు ఆ డైరీలో ఏముందో చదవుతామని కూతురిని ఆటపట్టించినట్టు బాధితురాలి తండ్రి వివరించారు.
"తను రోజూ డైరీని బ్యాగ్‌లో పెట్టుకునేది. మేం చాలా సార్లు అందులో ఏముందో చదువుతామని ఆటపట్టించే వాళ్లం. అంతే తప్ప నిజంగా ఎప్పుడూ అందులో ఏముందో చదవాలని అనుకోలేదు. ఎదిగిన కూతురి పర్సనల్ డైరీని మేం ఎందుకు చదవాలని అనుకుంటాం. అయినా తను హాస్పిటల్ నుంచి రాగానే మాతో అన్నీ చెప్పేది. ఎవరెవరు ఎలా ఇబ్బంది పెడుతున్నారో కూడా మాట్లాడేది. తన డైరీలో ఓ పేజీలో ఏదో రాసుకుని చించేసింది. ఇప్పుడు ఆ చిరిగిపోయిన ముక్క నా దగ్గరే ఉంది. కానీ అందులో ఏముందో మాత్రం నేను చెప్పలేను"
- బాధితురాలి తండ్రి
దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో వైద్యులు న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు. వైద్యుల భద్రతకు భరోసా లేదని మండి పడుతున్నారు. ఆర్‌జీ కార్ హాస్పిటల్ సిబ్బందిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. మాజీ ప్రిన్సిపల్‌ని మూడు రోజుల పాటు విచారించారు. అయితే..ఆయన చెప్పిన వివరాలని, హాస్పిటల్ సిబ్బంది చెప్పే వివరాలను పోల్చి చూసుకుంటున్నారు. పైగా హాస్పిటల్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ జరుగుతోందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఆ రహస్యాలు తెలిసిపోవడం వల్లే డాక్టర్‌ని ఇంత దారుణంగా చంపేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని ఆమెతో పాటు పని చేసే వైద్యులు చెప్పారు. తనని కావాలనే టార్గెట్ చేసి హత్య చేశారని మరికొందరు చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఓ సీనియర్ తనని వేధించే వాడని తల్లిదండ్రులూ ఇప్పటికే వెల్లడించారు. ఈ స్టేట్‌మెంట్స్ ఆధారంగా సీబీఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి కేసు విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. కేంద్రం పలు రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై నిఘా పెట్టింది.