Rayachoti Teacher Death: తరగతి గదిలో ఉపాధ్యాయుని అనుమానాస్పద మృతి - విద్యార్థులు కొట్టడం వల్లే చనిపోయాడా?, రాయచోటిలో విషాద ఘటన
Crime News: రాయచోటిలోని ఉర్దూ హైస్కూల్‌లో టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. తరగతి గదిలో గుండెపోటుతో టీచర్ కుప్పకూలగా.. విద్యార్థుల దాడి వల్లే చనిపోయాడని మృతుని భార్య ఆరోపించారు.
Teacher Suspicious Death In Rayachoti Urdu School: కడప జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తరగతి గదిలోనే ఓ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచోటి (Rayachoti) పట్టణం కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్‌లో ఎజాస్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే కుప్పకూలాడు. విద్యార్థులు అల్లరి చేస్తుండగా వారిపై కేకలు వేసే సమయంలో గుండెపోటుకు గురై కుప్పకూలినట్లు తెలుస్తోంది. వెంటనే గమనించిన సిబ్బంది ఆయన్ను రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, తన భర్తది గుండెపోటు కాదని.. తరగతి గదిలో ముగ్గురు విద్యార్థులు బలంగా కొట్టడం వల్లే చనిపోయాడని మృతుని భార్య రెహమూన్ ఆరోపించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.