Tirumala News: తిరుమల అలిపిరి గేట్ వద్ద యువతి హల్చల్ - పుష్ప 2 కిస్సిక్ పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్స్, భక్తుల ఆగ్రహం
Pushpa 2 Reel: తిరుమలలో అలిపిరి గేట్ వద్ద ఓ యువతి పుష్ప 2 పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Pushpa 2 Kissik Song Reel In Tirumala Alipiri Gate: కొందరు యువత సోషల్ మీడియాలో పాపులారిటీ, ఫాలోయర్స్, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు నడిరోడ్డుపైనే డ్యాన్స్ చేస్తూ హల్చల్ చేస్తుంటారు. కాగా, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో (Tirumala) ఫోటో షూట్లు, రీల్స్ చేయడం వంటివి నిషేధించినా కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వారి తీరు మార్చుకోవడం లేదు. తాజాగా, ఓ యువతి తిరుమల అలిపిరి గేట్ (Alipiri Gate) వద్ద డ్యాన్స్ చేస్తూ హల్చల్ చేసింది. పుష్ప 2 సినిమాలోని కిస్సిక్ పాటకు స్టెప్పులు వేస్తూ రీల్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ఇలాంటి డ్యాన్సులు వేయడంపై అసహనం వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని.. సదరు యువతిపై టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేయడం వివాదంగా మారింది. ఈ క్రమంలో శ్రీవారి సన్నిధిలో ఫ్రాంక్ వీడియోలు, రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ భక్తులపై క్యూలైన్లలోనే ఫ్రాంక్ చేశాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ సదరు వ్యక్తిపై చర్యలకు ఉపక్రమించింది. అనంతరం అతను భక్తులకు క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఫోటో షూట్ నిర్వహించడం సైతం వివాదంగా మారింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. అలాగే, తిరుమల మెట్ల మార్గంలో చిరుత అంటూ బిగ్‌బాస్ ఫేమ్ చేసిన ఫ్రాంక్ వీడియో సైతం విమర్శలకు దారి తీసింది. ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో టీటీడీ కఠిన నిబంధనలు విధించింది. అయినా, కొందరి తీరు మారడం లేదు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.