Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర
Andhra Pradesh Cabinet: ఇవాళ 11 గంటలకు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 14 అంశాలను చర్చించి ఆమోద ముద్ర వేసింది. అయితే ఈసారికి ఉద్యోగుల సమస్యలు మాత్రం చర్చకు రాలేదు.
Andhra Pradesh Cabinet: కొత్త సంవత్సరంలో తొలిసారిగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో 14 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. అమరావతి నిర్మాణ పనుల విషయంలో సీఆర్‌డీఏ తీసుకున్న నిర్ణయానికి ఓకే చెప్పింది మంత్రివర్గం. దాదాపు రూ.2,733 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు.
వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నుంచి అమ్మఒడి అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు కేంద్రం ఇచ్చే పది వేలకు మరో పదివేలు అదనంగా కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లలేని టైంలో 20వేలు సాయంగా ఇవ్వవనున్నారు. దీనికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు ఓకే చెప్పింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 8న విశాఖలో ప్రధానమంత్రి మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ పర్యటన విజయవంతం చేసేలా ప్రత్యేకంగా ఓ సబ్‌కమిటీ వేశారు.
నంద్యాల, వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపారు. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించే స్థలంపై చర్చించారు. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని కూడా చర్చించారు.
అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుకు అంగీకరించారు. నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలని నిర్ణయించారు. ఎస్‌ఐపీబీ అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.
సమావేశం ప్రారంభమైన తర్వాత సీఎస్‌గా కొత్తగా ఎంపికైన కే విజయానంద్‌ను మంత్రివర్గం అభినందించింది. అనంతరం అంతా కలిసి సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత అజెండాపై చర్చ మొదలు పెట్టారు.