Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Andhra Pradesh CM Chandra Babu: చాలా నమ్మకంతో గెలిపించిన ప్రజలే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు చంద్రబాబు. నేతలపై కక్ష సాధింపులకు సమయం లేదని చెప్పుకొచ్చారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బహిరంగంగానే ఈ కామెంట్స్ చేశారు. ఆయనతోపాటు లీడర్లు, కేడర్ రోజూ సోషల్ మీడియాలో దీనిపై చర్చిస్తూనే ఉన్నారు. అయితే అలాంటిదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తన లక్ష్యం వేరని తేల్చి చెప్పారు.
సమయాన్ని వృథా చేయబోం
2024లో ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారని అన్నారు చంద్రబాబు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి మంచి పాలన అందివ్వడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అ దిశగానే మొదటి రోజు నుంచి పాలన సాగిస్తున్నామని చెప్పారు. ఎవరిపైనో కక్ష సాధింపులు చేస్తూ కాలం వృథా చేయబోమన్నారు.
లడ్డూ లాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాం?
జగన్ మోహన్ రెడ్డిపైన, ఆ పార్టీ నేతలపై కక్ష ఉంటే మొదటి రోజు నుంచే ఆ పనిలో ఉండేవాళ్లమని అన్నారు చంద్రబాబు. ప్రజలకు మంచి చేయాలని గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జగన్‌పై కక్ష కట్టి ఉంటే లడ్డూ లాంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటామని ప్రశ్నించారు చంద్రబాబు. సెకీ ఒప్పందంలో జగన్ పేరు ఉన్నందున ఆయన్ని వెంటనే అరెస్టు చేసి విచారణ చేసేవాళ్లమని అన్నారు. అలాంటి వాటి జోలికి తాము వెళ్లబోమన్నారు.
చట్ట ప్రకారం శిక్ష పడుతుంది
అయితే తప్పు చేసిన వాళ్లను వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు ఏపీ సీఎం. కచ్చితంగా చట్ట ప్రకారం వారికి శిక్షలు ఉంటాయని తేల్చి చెప్పారు. సెకీ సహా అన్ని వ్యవహారాల్లో కచ్చితంగా రికార్డులు పరిశీలించే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అసలు ఐదేళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని అన్నింటినీ పంటి బిగువన భరించి పాలన సాగిస్తున్నామన్నారు చంద్రబాబు.
సోషల్ మీడియా సైకోలను వదలబోం
సోషల్ మీడియాలో ఆడవాళ్లను, ఇతరులపై తప్పుడు పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాంటివి కట్టడి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. అవి కక్ష సాధింపులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు కచ్చితంగా చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందేనన్నారు చంద్రబాబు. గత ఐదేళ్లు పాలన జరగలేదని పూర్తిగా రాష్ట్రానని, కీలక ప్రాజెక్టులను నాశనం చేసేలా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. అలాంటివి కరెక్ట్ చేయడానికే తమకు ఇంతకాలం పట్టిందన్నారు చంద్రబాబు.
మాట తప్పిన జగన్‌మోహన్ రెడ్డి
2019లో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి వాటిని అమలు చేయలేదని గుర్తు చేశారు. మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దుతోపాటు కీలక పథకాలు అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన పథకాలు కూడా ఎంతమందికి ఇచ్చారో తెలుసని అన్నారు. చాలా మంది అర్హులకు పథకాలు అందలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలియక కొన్ని హామీలు ఇచ్చామని నాలుక కరుచుకున్న సందర్భాలు చూశామన్నారు చంద్రబాబు. ఇప్పుడు తాము గత ప్రభుత్వం వేసిన చిక్కుముడులు విప్పుకుంటూ సమస్యలు పరిష్కరించుకొని ముందుకెళ్తున్నామన్నారు చంద్రబాబు.
Also Read: అమరావతికి కొత్త కళ- కీలక పనులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం- జనవరి 22 వరకు గడువు