Game Changer: ‘గేమ్ చేంజర్’పై ఎఫెక్ట్ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
Game Changer Movie Trailer Event: ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ ఘటన ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు శాపంగా మారింది. ముఖ్యంగా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాపై ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
‘గేమ్ చేంజర్’ (Game Changer)ని ‘పుష్పరాజ్’ భయపెట్టేశాడు. ఒక్క ‘గేమ్ చేంజర్’ అనే కాదు... తెలంగాణ రాష్ట్రంలో స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ జరగాలన్నా.. భయపడే పరిస్థితులని ‘పుష్ప 2’ సినిమా కల్పించింది. అది ఫస్ట్ ఫేస్ చేయబోతుంది మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినిమానే. అవును.. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు మూడు విడుదల కాబోతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’తో పాటు బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలున్నాయి. వీటిలో భారీ బడ్జెట్ చిత్రమంటే ‘గేమ్ చేంజర్’ సినిమానే. ఈ సినిమాకు ప్రమోషనల్ ఈవెంట్స్ ఎంతో కీలకం కూడా. కానీ ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ వ్యాప్తంగా స్టార్ హీరోల సినిమాలపై ఆంక్షలు నెలకొన్నాయి. అందులోనూ ‘గేమ్ చేంజర్’ నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం పిలిచి మరీ ఎఫ్‌డిసి ఛైర్మన్ పదవి ఇవ్వడంతో... ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ‘గేమ్ చేంజర్’కు భారీ ఈవెంట్స్ ఏమీ లేకుండానే.. సినిమా తెలంగాణలో విడుదల కానుంది.
అయితే, మరీ ఈ రేంజ్‌లో భయపడుతున్నారా? అనే విధంగా ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ పరిస్థితి మారిపోయింది. ‘భయపడుతున్నారా?’, ‘భయపెడుతున్నారా?’ అనే విషయం పక్కన పెడితే... ఆఖరికి ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి కూడా ఆంక్షలు విధించడం చూస్తుంటే... తెలంగాణలో సినిమా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవును... నేడు (గురువారం) ‘గేమ్ చేంజర్’ మూవీ ట్రైలర్‌ని హైదరాబాద్‌లోని AMB మాల్‌లోని స్క్రీన్‌లో విడుదల చేయనున్నారు. ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాల ట్రైలర్స్‌ని థియేటర్లలో విడుదల చేసే సమయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. మీడియాతో పాటు, ఫ్యాన్స్ అందరూ థియేటర్లలోకి అనుమతి ఉండేది. కానీ ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ ఈవెంట్‌కు మాత్రం టికెట్స్ పెట్టేశారు. టికెట్ ఉంటేనే థియేటర్ లోపలికి అనుమతి. ఆఖరికి మీడియా పర్సన్స్‌కి కూడా టికెట్ ఉండాల్సిందే అనేలా రూల్ పెట్టేశారు. అంటే, ‘పుష్ప’ ఘటన ఎంతగా భయపెట్టేసిందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: బన్నీని మళ్లీ కలిసిన కొరటాల... అప్పట్లో ఆగిన సినిమా పట్టాలు ఎక్కుతుందా? స్టేటస్ ఏమిటంటే?
టికెట్ ఉంటేనే థియేటర్‌లోనికి అనుమతి ఉంటుందని ‘గేమ్ చేంజర్’ పీఆర్ టీమ్ కూడా అధికారికంగా తెలియజేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటనతో ఏర్పడిన ఈ పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని, అందరూ టికెట్ తీసుకుని మాత్రమే లోపలికి వెళ్లాలంటూ స్పష్టమైన ప్రకటనను పీఆర్ టీమ్ విడుదల చేసింది. అయితే, కాస్త కఠినంగా ఉన్నా.. ఇది మంచి నిర్ణయమే అనేలా కూడా దీనిపై అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
మెగా ఫ్యాన్స్ ఈ వేడుకను గ్రాండ్ సక్సెస్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అంతే కాదు, ఈ ట్రైలర్ లాంచ్ తప్పితే, తెలంగాణలో ‘గేమ్ చేంజర్’కు సంబంధించి మరే ఇతర వేడుక బహుశా ఉండకపోవచ్చు. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని ఏపీలో నిర్వహించేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో జరిగే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని మెగా ఫ్యాన్స్ ప్రెస్టీజీయస్‌గా తీసుకుని, భారీగా తరలి వస్తే మాత్రం మళ్లీ ‘సంధ్య థియేటర్’ వంటి తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అందుకే, తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా.. ట్రైలర్ విడుదలకు కూడా ఆంక్షలు విధించి ఉండవచ్చంటూ.. సినీ పెద్దలు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నిర్ణయం మాత్రం మెగా ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Also Read: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?