Game Changer Censor: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?
Game Changer Censor Details: సంక్రాంతి మూవీస్‌లో భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’ సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ నుండి ఈ మూవీకి వచ్చిన అభ్యంతరాలు, నిడివి వివరాలివే..
సంక్రాంతికి వచ్చే సినిమాలలో ముందు వరసలో ఉన్న చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వాస్తవానికి 2024, డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తన ‘విశ్వంభర’కు అనుకున్న డేట్‌ని ‘గేమ్ చేంజర్’కి త్యాగం చేయడంతో... ఈ సినిమా సంక్రాంతి రేసులో భారీ బడ్జెట్ చిత్రంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా ముగించుకుని.. విడుదలకు అన్ని విధాలా సిద్ధమైంది. ఈ క్రమంలో సెన్సార్ నుండి ఈ సినిమాకు వచ్చిన అభ్యంతరాలు ఏమిటి? నిడివి ఎంత? సెన్సార్ వారు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..
ముందుగా ‘గేమ్ చేంజర్’ నిడివి విషయానికి వస్తే.. సెన్సార్ విధించిన కట్స్ అన్నీ పోనూ ఈ సినిమా 165 నిమిషాల 30 సెకన్లుగా ఉండనుంది. అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల నిడివితో ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలన్నీ 3 గంటల కంటే ఎక్కువ నిడివితో వస్తుండగా... ‘గేమ్ చేంజర్’ను మాత్రం 2 గంటల 45 నిమిషాలకే పరిమితం చేయడం శుభ పరిణామం అనే చెప్పువచ్చు. ఎందుకంటే, 3 గంటల ప్లస్ నిడివితో వచ్చిన చిత్రాలకు విడుదల తర్వాత మళ్లీ కొంతమేర అంటే కొన్ని నిమిషాల సీన్లను కట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు అలాంటి అవస్థ లేకుండా ముందుగానే మేకర్స్ మేల్కొన్నారని చెప్పుకోవచ్చు.
Also Read: రాజమౌళి సినిమాకు రెమ్యూనరేషన్ వద్దని చెప్పిన మహేష్ బాబు - ఎందుకంటే?
సెన్సార్ నుండి ఈ సినిమాకు వచ్చిన కట్స్ విషయానికి వస్తే... ‘గేమ్ చేంజర్’కు కట్స్ ఏమీ లేవు. కానీ, కొన్ని వర్డ్స్‌ని రీప్లేస్ చేయాలని సెన్సార్ టీమ్ ఆదేశించింది. అవేంటంటే..
1. టైటిల్ కార్డును తెలుగులో కూడా ప్రదర్శించాలి.
2. మద్యానికి సంబంధించిన లేబుల్స్‌ని తీసేయాలని ఆదేశించగా.. వాటిని సీజీతో కవర్ చేశారు.
3. సినిమాలో 3, 4 సార్లు వచ్చే ‘చట్టప్రకారం’ అనే వర్డ్ తొలగించాలి. అలాగే ‘కేరళ’ అనే పదాన్ని, అందుకు సంబంధించిన సబ్ టైటిల్‌ని తొలగించాలని సెన్సార్ టీమ్ ఆదేశించగా... చట్టప్రకారం అనే వర్డ్ ప్లేస్‌లో ‘లెక్క ప్రకారం’ అనే వర్డ్‌ని రీప్లేస్ చేశారు. కేరళ అనే పదాన్ని పూర్తిగా తొలగించారు.
4. దుర్గ శక్తి నాగ్‌పాల్ అనే పేపర్ కటింగ్‌ని తొలగించాలని ఆదేశించగా.. ఆ ప్లేస్‌ను ‘సుచిత్రా పాండే’తో రీప్లేస్ చేశారు.
5. టైటిల్ కార్డ్స్‌లో ‘పద్మశ్రీ బ్రహ్మానందం’ టైటిల్‌లోని ‘పద్మశ్రీ’ని తొలగించాలని ఆదేశించగా.. టీమ్ దానిని తొలగించింది.
ఈ యాడింగ్, రీప్లేస్‌మెంట్స్ తర్వాత కూడా నిడివిపై ఎటువంటి ప్రభావం పడలేదు. సెన్సార్ ఆదేశాలన్ని పాటించడంతో.. ఈ సినిమాకు ‘యు/ఏ’ సర్టిఫికేట్‌ని సెన్సార్ టీమ్ జారీ చేసింది. దీంతో జనవరి 10న ఈ సినిమా విడుదలకు లైన్ క్లియరైంది. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందించారు.
Also Read: బన్నీని మళ్లీ కలిసిన కొరటాల... అప్పట్లో ఆగిన సినిమా పట్టాలు ఎక్కుతుందా? స్టేటస్ ఏమిటంటే?