Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
Andhra News:వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
AP Highcourt Dismissed Borugadda Anil Bail Petition: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు (AP Highcourt) కొట్టివేసింది. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా.? అని వ్యాఖ్యానించిన కోర్టు.. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైందని చెప్పారు. కాగా, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. గురువారం ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇదీ బోరుగడ్డ అనిల్ చరిత్ర
బోరుగడ్డ అనిల్.. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు. గుంటూరు (Guntur) నగరానికి చెందిన ఈయన.. కేంద్ర మంత్రిగా పనిచేసిన రాందాస్ అఠావలె అనుచరుడిగా చెప్పుకొంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యాడు. జగన్‌ను అన్నా అంటూ తాను పులివెందులకు చెందినవాడినేనంటూ వైసీపీ నేతలతో తిరిగాడు. వైసీపీ హయాంలో సోషల్ మీడియా, పలు యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూల్లో చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), లోకేశ్‌లే టార్గెట్‌గా దుర్భాషలతో విరుచుకుపడ్డాడు. వైసీపీ అధినేత జగన్ భజనే పరమావధిగా వీరిపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ హల్చల్ చేశాడు. జగన్ పేరు చెబుతుండడంతో పోలీసులు సైతం అతని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిని వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొద్ది రోజులు పరారయ్యాడు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై పలుచోట్ల కేసులు నమోదు కాగా పోలీసులు బోరుగడ్డను అరెస్ట్ చేయగా... కోర్టు రిమాండ్ విధించింది.
పీఎస్‌లో రాచమర్యాదలు
అయితే, బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేసి ఉంచినా అతనికి పోలీసులు రాచమర్యాదలు చేశారన్న విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. పీఎస్‌లోనే దిండు, దుప్పటి అందించిన నలుగురు పోలీస్ సిబ్బందిపై వేటు వేశారు. ఇటీవలే రాజమహేంద్రవరం కారాగారానికి తరలిస్తూ.. పోలీసులు ఓ రెస్టారెంట్‌లో బోరుగడ్డకు బిర్యానీ అందించారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన టీడీపీ సానుభూతిపరులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీనిపైనా విచారించి సదరు పోలీసులపై చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం రాజమండ్రి జైలులో బోరుగడ్డ ఉండగా.. ఆయనపై అనంతపురంలోనూ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బోరుగడ్డను అనంతపురం నుంచి రాజమండ్రికి తరచూ తరలించేవారు. అనంతలో నమోదైన కేసును తాజాగా విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదంటూ స్పష్టం చేస్తూ బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది.
Also Read: Tirumala: తిరుమలలో మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది.. నాయుడు గారూ కాస్త పట్టించుకోరూ!