Suryapet: మహిళ బట్టలిప్పేసి కళ్లలో కారం కొట్టి.. కర్రలతో కొడుతూ నగ్నంగా ఊరేగింపు
నగ్నంగా ఉన్న ఆమెను ఊరంతా తిప్పుతూ ఊరేగించారు. దాదాపు గంటకు పైగా ఈ తతంగం జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనించదగ్గ విషయం.
సూర్యాపేటలో అత్యంత అమానుషమైన, సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ మహిళను వివస్త్రను చేసి, ఆమె కళ్లలో కారం కొట్టారు. అంతేకాక, నగ్నంగా ఉన్న ఆమెను ఊరంతా తిప్పుతూ ఊరేగించారు. దాదాపు గంటకు పైగా ఈ తతంగం జరిగినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనించదగ్గ విషయం. శనివారం నాడు వెలుగు చూసిన ఈ దారుణ ఘటనకు సంబంధించి వివరాలు ఇవీ..
సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ హత్య కేసులో నిందితురాలిగా ఉంది. ఈమెపై ఉన్న కోపంతో మృతుడి కుటుంబ సభ్యులు ఇలా ప్రతీకారం తీర్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని రాజు నాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తి జూన్ 13న హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ నిందితురాలిగా ఉంది. అమెను పోలీసులు అరెస్టు కూడా చేశారు. శంకర్ నాయక్ సహా అతని కుటుంబంతో మహిళకు పాత కక్షలు ఉండడంతో ఆమె హత్య చేసి ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. అరెస్టయిన ఆ మహిళ ఇటీవల బెయిల్‌పై విడుదలైంది. తర్వాత సొంతూరిలో ఉండకుండా సూర్యాపేటలోని తన సోదరి ఇంట్లో తలదాచుకుంటుంది.
ఈ క్రమంలో మహిళ సొంతూరు రాజు నాయక్ తండాకు చెందిన ఓ బంధువు శనివారం చనిపోయారని తెలుసుకొని ఆ మహిళ అక్కడికి వెళ్లారు. శంకర్ నాయక్ హత్యా తర్వాత మహిళ తొలిసారి ఆ గ్రామానికి వెళ్లింది. ఇలా ఊళ్లోకి వచ్చిన విషయం ప్రత్యర్థులకు తెలిసింది. తండాకు వచ్చిన ఆమెను చూసి కోపోద్రిక్తులైన శంకర్ నాయక్ బంధువులు ఆమెపై దాడి చేశారు. మహిళను ఇంట్లోంచి బయటకు ఈడ్చుకొని వచ్చి దారుణంగా అందరి ముందే ఒంటిపై బట్టల్ని లాగి తీసేశారు. కళ్లల్లో కారం కొట్టి, నగ్నంగా ఉన్న ఆమెను కర్రలతో బాదారు. వీధుల్లో నగ్నంగా తిప్పారు.
Also Read: Gold-Silver Price: మీ నగరంలో పసిడి, వెండి రేట్లు ఇలా.. స్వల్పంగా పెరిగిన బంగారం
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు
నడి రోడ్డులో దాదాపు గంటకుపైగా సేపు జరిగిన ఈ అమానుషాన్ని ఎవరూ అడ్డుకోలేదు. ఎట్టకేలకు వారి నుంచి మహిళ తప్పించుకొని స్థానిక ప్రజా ప్రతినిధి ఇంటికి పరుగులు తీసింది. ఆ ప్రజా ప్రతినిధి బాధిత మహిళకు బట్టలిచ్చి ఓ గదిలోకి పంపి రక్షణ కల్పించారు. విషయం తెలిసి పోలీసులు తండాకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే బాధితురాలిని సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలను బాధితురాలు పోలీసులకు చెప్పింది. తనపై దాడి జరుగుతుండగా సర్పంచి, గ్రామపెద్దలు చూస్తున్నా అడ్డుకోలేదని పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట గ్రామీణ ఎస్సై లవ కుమార్ వెల్లడించారు.