Amaravati News: అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ -త్రిసభ్య కమిటీ కీలక సమావేశం
Amaravati News: అమరావతి రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ సమావేశమైంది. రైతులు లేవనెత్తిన ఇష్యూలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Amaravati News: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే సీఆర్‌డీఏ భవనం ప్రారంభోత్సవం జరిగింది. మరో ఆరేడు నెలల్లో మరికొన్ని భవనాలుపూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజధాని ప్రాంత రైతుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు వారి సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీని కోసం వేసిన త్రిసభ్య కమిటీ ఇవాళ సమావేశమై కీలకాంశాలపై క్లారిటీ ఇచ్చింది.
అమరావతిలో త్రిముఖ వ్యూహంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఓవైపు రాజధాని పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు పరిష్కారం కాని సమస్యలపై రైతుల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చి వాటిని రిజాల్వ్ చేసేం ప్రయత్నాల్లో ఉంది. రెండో విడత సమీకరణకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే రైతుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ కుమార్ ఉన్నారు. అమరావతి ప్రాంత రైతులకు, అధికారులకు అనుసంధానంగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు.
రాజధాని ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తోపాటు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా,రాజధాని రైతులు హాజరయ్యారు. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా పరిష్కారం కాని ఇష్యూలను వివరించారు. వాటి పురోగతిని అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఒకేసారి అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు కమిటీ సభ్యులు వివరించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రినారాయణ.." రాజధాని రైతుల సమస్యల పరిష్కారం పై ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. గ్రామ కంఠాల ప్లాట్‌లు, వీధి పోటు ప్లాట్‌లు, జరీబు,అసైన్డ్ భూముల సమస్యలపై చర్చించాం. గ్రామ కంఠాలలో ప్లాట్‌లు పొందిన వారు నిబంధనల ప్రకారం తీసుకున్నారా లేదా అనేది వెరిఫై చేస్తాం. జారీబు - నాన్ జరీబు సమస్యలపై చర్చించాం. రోడ్డు పోటు ఉన్న ప్లాట్‌లు వెరిఫై చేసి మార్చేలా చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూముల సమస్యపై ప్రత్యేకంగా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆర్ అండ్ బీ రోడ్లలో స్థలం కోల్పోతున్న వారికి TDR బాండ్లు ఇస్తాం. రైతు సోదరులందరూ 58 రోజుల్లో 34 వేలు ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చి ఎంతో సహకరించారు. రైతులకు వ్యక్తిగతంగా బెనిఫిట్ కావాలంటే నిబంధనల ప్రకారం అవకాశం ఉండదు. నిబంధనల ప్రకారం ఉంటే 100 శాతం న్యాయం చేస్తాం. డిసెంబర్ 3 న కోర్టు కేసులు విత్ డ్రా అయితే వెంటనే భూసేకరణ కు వెళ్తాం. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ కోసం ముందుకు వచ్చిన రైతుల వద్ద భూములు తీసుకున్నాం. " అని వివరించారు.





















