Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న చరిత్ర అలాంటిది.. మాజీ ఉద్యోగుల సంచలన ఆరోపణలు
తీన్మార్ మల్లన్నపై క్యూ న్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ ఆరోపణలు చేశారు. ఆయన తన తోటి మాజీ ఉద్యోగులతో కలిసి శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వంపై రోజూ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తీవ్రమైన విమర్శలు చేస్తుండే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై రోజురోజుకూ ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. ఆయన ఛానెల్ క్యూ న్యూస్ మాజీ బ్యూరో చీఫ్ మరోసారి మల్లన్నపై ఆరోపణలు చేశారు. తీన్మార్ మల్లన్న జర్నలిస్టు కాదని, ఓ బ్లాక్ మెయిలర్ అంటూ క్యూ న్యూస్ మాజీ బ్యూరో చీఫ్ చిలుక ప్రవీణ్ విమర్శించారు. అమ్మాయిలను సైతం బ్లాక్‌మెయిల్‌చేసి వారి జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర ఆయనదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మల్లన్నపై లైంగిక వేధింపుల కేసులు సైతం ఉన్నాయని తెలిపారు. చిలుక ప్రవీణ్ కుమార్ తన తోటీ మాజీ ఉద్యోగులతో కలిసి శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
మల్లన్న మాటలు విని పాతబస్తీలో ఓ యువకుడు ప్రస్తుతం మతితప్పి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న టీమ్‌లోని ఉద్యోగుల తల్లిదండ్రులు మేల్కొనాలని చెప్పారు. మల్లన్న సైకో అని, ఆయన మాటలు విని ఉద్యోగులు పిచ్చోళ్లు అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దగ్గర ఉంటే వారు సొంతంగా ఆలోచించుకోలేకపోతున్నారని చెప్పారు. మల్లన్నపై చట్టపరంగా విచారణ జరుగుతుందని, ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
తీన్మార్ మల్లన్న డబ్బులను అక్రమంగా సంపాదించారని చిలుక ప్రవీణ్ కుమార్ ఆరోపణ చేశారు. డబ్బులు, ఆయన ఆస్తులు బినామీల పేరిట పెడుతుంటారని, ఆయన బినామీల్లో నాగరాజు గౌడ్, దాసరి భూమయ్య, రజనీ కుమార్, రంగయ్య, చింతపండు వెంకటేశ్వర్లు, ఉపేందర్ ఉన్నారని ప్రవీణ్ వివరించారు. మల్లన్న అరెస్టు సరైనదేనని, అలాంటి వ్యక్తిని సమాజంలో తిరగనివ్వకుండా చట్టపరంగా శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మల్లన్న డబ్బులు తీసుకుంటాడని అనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయని క్యూ న్యూస్ కెమెరామెన్ చుక్క చంద్రశేఖర్ ఆరోపించారు. ఆయన ఆఫీసులోనే సెటిల్‌మెంట్లు నడుస్తుంటాయని పేర్కొన్నారు. మల్లన్నకు బహుజనవాదం తెలియదని, కేవలం డబ్బు సంపాదన కోసమే ఆయన బహుజనవాదం, జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుంటుంటారని ఆరోపించారు. లక్ష్మీకాంత్ అనే స్వామీజీ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసి ఆయన్ను బెదిరించగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
మల్లన్నకు 14 రోజుల రిమాండ్..
మరోవైపు, జ్యోతిష్యుడిని బెదిరించిన కేసులో అరెస్టయిన తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సికింద్రాబాద్‌కు చెందిన సన్నిధానం లక్ష్మీకాంత శర్మను బెదిరించారంటూ కేసు నమోదు కావడంతో శుక్రవారం రాత్రి తీన్మార్ మల్లన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ సివిల్ కోర్టు జడ్జి ఎదుట వర్చువల్‌గా హాజరుపరిచారు. ఈ క్రమంలోనే రిమాండ్ విధించారు.