Krishna Scrub Typhus Fever: కృష్ణా జిల్లాలో వింత జ్వరాలు! "స్క్రబ్ టైఫస్ "తో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం అంటున్న డాక్టర్లు
మొన్నటి వరకు డయేరియాతో ఇబ్బంది పడ్డ కృష్ణా జిల్లా ప్రజలు ఇప్పుడు వింత జ్వరాలో టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు వస్తున్న "స్క్రబ్ టైఫస్ " జ్వరాలతో జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం అంటున్నారు డాక్టర్లు.

Krishna Scrub Typhus Fever:మూడేళ్ల క్రితం ఢిల్లీ, తమిళనాడులో కనిపించిన 'స్క్రబ్ టైఫస్ " అనే జ్వరాలు ఇప్పుడు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మచిలీపట్నం నుంచి వచ్చే రోగుల్లో నమోదు అవుతున్నాయని అంటున్నారు కొందరు డాక్టర్లు. చాలా కాలం హై ఫివర్, ప్లేట్ లెట్స్ పడిపోవడం వంటివి దీని లక్షణాలుగా వారు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు వెంటనే సరైన వైద్యం తీసుకోకుంటే కొన్నిసార్లు ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని కృష్ణా జిల్లా నుంచి వస్తున్న కేసుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని విజయవాడకు చెందిన ఊపిరి హాస్పిటల్స్‌లో ఎండీగా పని చేస్తున్న Dr. రఘు రామ్ ఒక వీడియోలో తెలిపారు. అయితే విజయవాడ నుంచి జ్వరంతో వచ్చిన వాళ్లలో ఈ వ్యాధి ఇంతవరకూ కనిపించలేదని ఆయన అన్నారు
నల్లి లాంటి పురుగు కాటుతో వచ్చే ప్రాణాంతక వ్యాధి.. "స్క్రబ్ టైఫస్"
మట్టిలో ఉండే చిన్న నల్లిలాంటి క్రిమి కాటుతో ఈ వ్యాధి వస్తుంది. చాలా కాలం జ్వరం ఉండడం ప్లేట్లు లెట్స్ పడిపోవడంతో ఇది "డెంగీ " అని భ్రమ పడతారు. కానీ నిర్ణీత పరీక్షలతో ఈ వ్యాధి ని నిర్ధారించవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. అందుకే సాధారణ జ్వరం అని ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందిగా వారు ప్రజలకు సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో అక్కడక్కడా ఈ వ్యాధి కనిపిస్తుందని ఎక్కువగా కొండ ప్రాంతాల్లో కనిపించే ఈ పురుగు ఇప్పుడు సిటీల్లో సైతం కనిపించడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. మట్టిలో కలిసిపోయే ఈ పురుగు కాటు వల్ల ప్లేట్ లెట్స్ పడిపోతాయని నిర్లక్ష్యం చేస్తే బాడీలో మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినే ప్రమాదం ఉందని డాక్టర్స్ అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సోకితే అలాంటివారు రికవర్ కావడం కాస్త కష్టం అని డాక్టర్ రఘురామ్ అభిప్రాయపడ్డారు. ఇది అంతా ప్రజల్లో అవగాహన పెంచడం కోసమేననీ అయన అన్నారు.
వ్యాధి ప్రధాన లక్షణాలు
1) ఎక్కువ కాలం జ్వరం
2) విపరీతమైన ఒంటి నొప్పులు
3) తలనొప్పి
4) కొన్ని సార్లు తలనొప్పి
5) ప్లేట్ లెట్స్ పడిపోవడం
6) క్రియాటిన్ పెరగడం
RMPలపై, సొంత వైద్యం ఫై ఆధార పడొద్దు
ప్రస్తుతం శీతకాలం సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ఒకటికి రెండు రోజులు జ్వరం గనక ఎక్కువగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ వద్దకు వెళ్లాలని లోకల్ ఆర్ఎంపీ డాక్టర్లు లేదా సొంత వైద్యంపై ఎక్కువగా ఆధారపడద్దని ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ప్రభుత్వం కూడా కృషి చేయాలి అనేది వారి సూచన.





















