Shamshabad- Women Murder: ఆమె ఎవరో తేల్చిన పోలీసులు, సంచలనం రేపిన శంషాబాద్ హత్య కేసులో అప్ డేట్
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన దిశ తరహా హత్య కేసులో చనిపోయిన మహిళ ఎవరు అనేది పోలీసులు గుర్తించారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాళ్లగూడదొడ్డికి చెందిన వడ్ల మంజులగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన దిశ తరహా హత్య కేసులో చనిపోయిన మహిళ ఎవరు అనేది పోలీసులు గుర్తించారు. ఆమెను శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాళ్లగూడదొడ్డికి చెందిన వడ్ల మంజులగా పోలీసులు గుర్తించారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రం శ్రీనివాస ఎన్ క్లేవ్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై పెట్రోలు పోసి నిప్పు అంటించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రెండు రోజుల క్రితం కడుపు నొప్పి వస్తుందని మంజుల తన భర్త లక్ష్మయ్యకు చెప్పింది. కొద్ది సేపటి తరువాత ఆమె హస్పిటల్ కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ తరువాత మంజుల కనిపించడం లేదని శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేశాడు.
అయితే అసలు మంజులను చంపింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? అనే కారణాలను కనుగొనేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. శంషాబాద్ పరిధిలో ఓ మహిళ మృతదేహం కాలిపోతున్నట్లు పోలీసులకు గురువారం అర్ధరాత్రి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మహిళ మృతదేహం సగం కంటే ఎక్కువ కాలిపోయి కనిపించింది. తరువాత కాలిన మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ చేసినట్లు పోలీసులు వివరించారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మహిళ మృతదేహం వద్ద అగ్గిపెట్టెను కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ లతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పరిశీలించారు.
మహిళను హత్య చేసి దహనం చేశారా? లేక మృతదేహానికి నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని శంషాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావు తెలిపారు. విచారణలో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. తొండుపల్లిలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి ఓ అనుమానితుడు పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించమని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతని వెనుక మరో వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.