Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
రైల్వే పని కోసం కాంట్రాక్టర్ నియమించిన కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు గూడ్స్ రైలు బోగీల కింద ఆశ్రయం పొందారు. ఈదురు గాలుల కారణంగా బోగీలు కదిలాయి. ఆరుగురు కార్మికులు మృతి చెందారు.
బహంగా రైలు ప్రమాదం ఇంకా మర్చిపోక ముందే ఒడిశాలో బుధవారం (జూన్ 7) మధ్యాహ్నం మరో ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్-కెందుఝర్ రోడ్ రైల్వే స్టేషన్‌లో రైలు కింద ఉండి ఆరుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఈ రోజు సాయంత్రం 5:15 గంటలకు జాజ్‌పూర్ రోడ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో, వర్షం నుండి తప్పించుకోవడానికి కార్మికులు జాజ్‌పూర్-కెందుజార్ రోడ్ రైల్వే స్టేషన్‌లోని సాయిమందిర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న రైలు కింద తలదాచుకున్నారు. స్టేషన్‌లో నిలబడిన రైలు కొద్దిసేపటి తర్వాత ముందుకు కదిలింది. దీంతో రైలు చక్రాల కింద పడి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రక్షించి జాజ్‌పూర్ రోడ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ముగ్గురు చనిపోయినట్లు ప్రకటించారు. మరో ఇద్దరు క్రిటికల్ పేషెంట్లను కటక్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, రైల్వే పని కోసం కాంట్రాక్టర్ నియమించిన కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు గూడ్స్ రైలు బోగీల కింద ఆశ్రయం పొందారు. ఈ రోజు భారీ ఈదురు గాలుల కారణంగా ఇంజిన్ పనిచేయకపోయినప్పటికీ బోగీలు కదిలాయి. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. దీంతో రైల్వేశాఖ అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఖుర్దా ప్రాంత డీఆర్‌ఎంతోపాటు ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలికి వెళ్లారు.
స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం, జాజ్‌పూర్ రోడ్ ప్రాంతంలో పని చేయడానికి వివిధ ప్రాంతాల నుండి కూలీలు వస్తుంటారు. గూడ్స్ రైలు కింద ఆశ్రయం పొంది ప్రమాదానికి గురైన కార్మికులు కూడా అలాగే పనికి వచ్చి ఉండవచ్చని చెప్పారు. వారు పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి రైలు కోసం వేచి ఉండాల్సి ఉంది. ఆ సమీపంలో వాన నుంచి రక్షణ పొందడానికి ఏమీ లేకపోవడంతో కూలీలు బోగీల కింద కూర్చొని ఉంటారని స్థానికులు తెలిపారు.
5 రోజుల కిందటే ఘోర ప్రమాదం
జూన్ 2వ తేదీన బాలేశ్వర్ జిల్లా బహంగా బజార్‌లో గూడ్స్ రైలు - కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ - యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 288 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఒడిశాకు చెందిన 39 మంది ఉన్నారు. అదేవిధంగా, ఈ ప్రమాదంలో వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాలా మంది కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు.
జబల్‌పూర్‌లో మరో ఘటన..
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్‌లో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో LPG లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ వ్యాగన్‌లు అదుపు తప్పాయి. రెండు వ్యాగన్‌లు కిందపడిపోయాయి. అన్‌లోడింగ్ చేసే సమయంలో వ్యాగన్‌లు కింద పడిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంపై ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పందించింది. ఈ ఘటనతో రైల్వేకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఓ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన గూడ్స్ ట్రైన్ ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే అదుపు తప్పి పడిపోయిందని స్పష్టం చేసింది.