Nellore News : బాలికపై మేనమామ లైంగిక దాడి, ప్రతిఘటించడంతో గొంతుకోసి యాసిడ్ దాడి
Nellore News : నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై మేనమామ యాసిడ్ దాడి చేశారు.
Nellore News : సీఎం జగన్ మరికొన్ని గంటల్లో నెల్లూరు జిల్లాకు రాబోతున్న సమయంలో ఒక్కసారిగా జిల్లా ఉలిక్కిపడింది. ఓ దారుణ ఘటన నెల్లూరు నగరానికి సమీపంలో చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేయబోయిన మేనమామ ఆమె ప్రతిఘటించడంతో గొంతు కోశాడు. అక్కడితో ఆగకుండా, ఆమెపై యాసిడ్ పోశాడు. ముఖమంతా కాలిపోయి తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక ఇప్పుడు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన వెంకటాచలం మండలం చెముడుగుంట నక్కలకాలనీలో జరిగింది.
బాలికపై అత్యాచారయత్నం
వెంకటాచలం మండలం చెముడుగుంటలోని ఓ కాలనీలో 9వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. బాలిక తండ్రి ఆ సమయంలో ఇంట్లో లేరు. తల్లి కూడా పనిపై బయటకు వెళ్లడంతో ఇంట్లో బాలిక ఒక్కతే ఉంది. దీంతో బాలికపై అత్యాచారం చేయడానికి ఇదే అదునుగా భావించాడు మేనమామ నాగరాజు. మేనమామ అత్యాచారానికి ప్రయత్నించడంతో వారించిన బాలిక బాత్రూమ్ లోకి పరుగులు తీసింది. చివరకు బాత్రూమ్ లో ఆమెను బంధించిన నాగరాజు.. అక్కడి యాసిడ్ తీసి ఆమెపై పోశాడు. కత్తితో గొంతు కోసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. కొనఊపిరిలో ఉన్న బాలికను తల్లిదంద్రులు నెల్లూరు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకున్నాడు.
కొన్నాళ్లుగా వేధింపులు
మేనమామ నాగరాజు కొన్నాళ్లుగా బాలికను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వేధింపులు తట్టుకోలేక కొన్నాళ్లు మాట్లాడడంలేదు. కానీ అతడు వదల్లేదు. అదునుకోసం వేచి చూశాడు. చివరకు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికను బలాత్కరించబోయాడు. మాట వినకపోయే సరికి హతమార్చాలనుకున్నాడు. యాసిడ్ పోసి దారుణంగా ప్రవర్తించాడు. గొంతు కోసి ప్రాణం తీయాలని సైతం చూశాడు.
ఆ దుర్మార్గుడిని వదలొద్దు
గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావం అయింది. మరోవైపు ఆమె ముఖం అంతా కాలిపోయింది. అలాంటి స్థితిలో కూడా మేనమామ నాగరాజుని వదిలిపెట్టొద్దని పోలీసులను వేడుకుంది బాలిక. దీన్ని బట్టి చూస్తే వాడు ఎంత కిరాతకంగా ప్రవర్తించాడో అర్థమవుతుంది. నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిషితను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ముఖంపై యాసిడ్ పోయడంతో చర్మం మొత్తం కాలిపోయింది. గొంతు కోయడంతో ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.