Fire Break: టాటా ఐఫోన్ల తయారీ కేంద్రంలో భారీ పేలుడు - ఎగిసిపడిన మంటలు, షాకింగ్ వీడియో
Tamilnadu News: తమిళనాడులోని టాటా మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఉద్యోగులను బయటకు తరలించారు. 7 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు.
Severe Fire Break In TATA Electronics Plant In Tamilnadu: తమిళనాడులోని (Tamilnadu) టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రసాయన గోదాంలో పేలుడు సంభవించగా పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరి జిల్లా (Krishnagiri District) ఉద్దానపల్లిలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (TEPL)లో గల మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్‌లోని రసాయన గోదాంలో శనివారం ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో దాదాపు 1500 మంది కార్మికులు షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని 7 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు.
ஓசூர் டாடா நிறுவனத்தில் இன்று அதிகாலை பயங்கர தீ விபத்து. pic.twitter.com/sULS1LtRGQ
— Velmurugan (@Velmuru07180285) September 28, 2024
ఈ కంపెనీలో TEPL సంస్థ ఐఫోన్లలో వాడే వివిధ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తోంది. సుమారు 4,500 మంది ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారు. రాత్రి పూట ప్రమాదం జరగ్గా.. అంతా అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగగా.. కొందరు శ్వాస కోశ సమస్యలతో ఇబ్బంది పడగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రభావిత ప్రాంతంలో దాదాపు 100 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించామని ఎస్పీ తంగదురై వెల్లడించారు.