Lorry Driver Dies: లారీలోనే డ్రైవర్ అనుమానాస్పద మృతి, పట్టించుకోని ఫ్యామిలీ - అసలేం జరిగిందంటే !
Lorry Driver Dies: కుళ్లిపోయిన స్థితిలో లారీలో మృతదేహం కనిపించింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Lorry Driver Dies: లారీ లోనే డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. మృతుడు విజయవాడకు చెందిన షేక్ మస్తాన్ గా పోలీసులు గురించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో నాలుగైదు రోజుల కిందట మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సహజ మరణమా లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు.
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద సిమెంట్ లారీ నుండి దుర్వాసన వస్తుండటంతో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలనికి చేరుకుని పరిశీలించగా లారీ లోనే కుళ్లిపోయి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. ఈ నెల19వ తేదీన సిమెంట్ లోడుతో రాజమండ్రి బయలుదేరి వెళ్లిన మస్తాన్, లోడు దిగుమతి చేసి విజయవాడ వస్తుండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లారీలోనే మస్తాన్ మృతదేహం కనిపించింది. మస్తాన్ అనారోగ్య కారణంగా, మరణించాడా లేక ఎవరైనా హత్యచేసి ఉంటారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
అసలేం జరిగింది... ఈ ఘటన స్దానికంగా తీవ్ర కలకలం సృష్టించింది..మస్తాన్ మృతి చెందిన విషయాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. కనీసం కుటుంబ సభ్యులు కూడా మస్తాన్ ను గురించి వాకబు చేయలేదు. అంతే కాదు లారీ యజమాని కూడా లారీని గురించి పట్టించుకోకపోవటం అనుమానాలు మొదలయ్యాయి. సిమెంట్ లోడ్ ను దిగుమతి చేసిన తరువాత మస్తాన్ తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇక ఆ తరువాత నుండి ఏం జరిగిందనేది, ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. లారీలోనే మస్తాన్ మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో ఎవ్వరూ దగ్గరకు వెళ్లలేని పరిస్దితి. చెడు వాసన వ్యాపించటంతో టోల్ సిబ్బంది స్దానికంగా చెత్త కుప్పల్లో పశువుల కళేబరాలు ఉన్నాయని భావించారు. అయితే అక్కడ కూడ ఎటువంటి ఆనవాళ్లు లేవు. దీంతో సీసీ కెమేరాలు పరిశిలిస్తుండగా కొద్ది రోజులుగా లారీ అక్కడే ఉండటాన్ని పరిశీలించారు.
అనుమానంతో క్యాబిన్ లో పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా క్లూస్ టీంతో పాటుగా డాగ్ స్వ్కాడ్‌ను కూడా రంగంలోకి దింపారు. లారీ ఎప్పటి నుండి అక్కడే పార్గింగ్ చేసి ఉందనే విషయాలను సీసీ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నారు. లారీ వచ్చిన తరువాత నుండి అందులో జరిగిన కదలికలను కూడా పోలీసులు పరిశీలంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే లారీ సగ భాగం మాత్రమే సీసీ కెమెరాలో కనిపిస్తుండటంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్ గా మారింది.