Road Accident : రోడ్డు పక్క గుంతలో బోల్తా పడిన కారు, ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
Road Accident : అన్నవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయలయ్యాయి.
Road Accident : కాకినాడ జిల్లాలోని 216 నేషనల్ హైవే రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. రాజమండ్రి నుంచి విశాఖ వెళ్తోన్న మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు అన్నవరం వద్ద నేషనల్ హైవే రోడ్డు పక్కన ఓ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. కారు నెంబరు AP 35K 5090గా పోలీసులు గుర్తించారు. కారు గుంతలో పడడంతో కారులో ప్రయాణిస్తున్న కుటుంబంలో భర్త అక్కడికక్కడే మృతి చెందారు. భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ మహిళ పేరు బొట్టు వెంకట పద్మావతిగా పోలీసులు గుర్తించారు. 108 వాహనంలో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 108 వాహనంలో గాయపడిన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎడ్లబండి చెరువులో బోల్తా-తండ్రి కొడుకులు మృతి
గుంటూరు జిల్లా మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎద్దుల బండి తిరగబడి తండ్రి కొడుకులు మృతి చెందారు. జత ఎడ్లు కూడా మృత్యువాత పడ్డాయి. మధిర నాగరాజు(31) కౌలు రైతు. రెండెకరాలలో మొక్క జొన్న పంట వేశాడు. ప్రతి రోజు లాగా ఈ రోజు తన కుమారుడు శరణ్(10) తో కలసి పొలానికి వెళ్లాడు. మొక్క జొన్న కంకులను తెంచి బండిలో వేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండటంతో ఎద్దులు రామన్న కుంట చెరువులోకి నీరు తాగేందు లాక్కుపోయాయి. చెరువులో కూరుకుపోయి ఎద్దుల బండి బోల్తా కొట్టడంతో తండ్రి కొడుకులు మృతి చెందారు. ఎడ్లు సహితం మృత్యవాత పడ్డాయి. తండ్రి కొడుకుల మృతితో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.
యాదాద్రి పుష్కరిణిలో పడి బాలిక మృతి
యాదాద్రి కొండ కింద గండి చెరువు దగ్గర లక్ష్మీ పుష్కరిణిలో పడి ఓ బాలిక చనిపోయింది. కుటుంబసభ్యులతో కలిసి పుష్కరిణిలో స్నానానికి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు పడిపోయింది. అయితే బాలిక గమనించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు హైదరాబాద్ గుడి మల్కాపూర్ కి చెందిన బొంతల రోజా(15)గా పోలీసులు గుర్తించారు. బాలిక మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దైవదర్శనానికి వచ్చిన తమకు ఇలా జరిగిందంటూ బాలిక తల్లి రోధించిన తీరు పక్కనున్న వారిని కలచివేసింది. బాలిక మృతితో లక్ష్మీ పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి ఆలయ అధికారులు అనుమతి నిలిపివేశారు. సంప్రోక్షణ అనంతరం అనుమతిస్తామని తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.