CI Nageswararao Case : అజ్ఞాతంలో సీఐ నాగేశ్వరరావు, రేపటిలోగా అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్
CI Nageswararao Case :మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఐను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఎల్బీనగర్ ధర్నాకు దిగాయి.
CI Nageswararao Case :మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును అరెస్టు చేయాలని ఎల్బీనగర్ డీసీపీ ఆఫీసు ముందు కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. రోడ్డుపై కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మహిళపై అత్యాచారం చేసిన సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
హోంమంత్రి కనిపించడంలేదు
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్బీనగర్ డీసీపీ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. రేపటిలోగా సీఐ నాగేశ్వరరావును అరెస్టు చేయకపోతే తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్ లను ముట్టడిస్తామని కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు శివసేన రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా హోమ్ మంత్రి మహమూద్ అలీ కనిపించడం లేదని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.
అజ్ఞాతంలో సీఐ
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ సీఐ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. తన భర్తను, తనను రివాల్వర్‌తో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారని, అంతేకాకుండా ఓ కేసులో వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్ కేసులు పోలీసులు నమోదు చేశారు. సీఐ నాగేశ్వరరావును హైదరాబాద్ సీపీ ఆనంద్ ఇప్పటికే సస్పెండ్ చేశారు. బాధితురాలు, ఆమె భర్త స్టేట్మెంట్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చి్ంది. సీఐ నాగేశ్వరరావుకు కూడా కరోనా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తు్న్నారు. సీఐను అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
వివాహిత మహిళను తుపాకితో బెదిరించి అత్యాచారం చేసిన మారేడ్ పల్లి CI నాగేశ్వరరావును వెంటనే డిస్మిస్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎల్బీ నగర్ డిసిపి ఆఫీస్ ఎదుట ధర్నా చేసిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు @ShivaSenaIYC & ఇతర యూత్ కాంగ్రెస్ నాయకులు @IYC pic.twitter.com/gLwTMQuwTA
— Telangana Youth Congress (@IYCTelangana) July 10, 2022