(Source: ECI/ABP News/ABP Majha)
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో ఐదుగురు నిందితులు అరెస్టు
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్య అనంతరం నిందితులు కర్ణాటక వైపు పారిపోయారని గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకున్నారు.
Begumbazar Honour Killing : హైదరాబాద్ బేగంబజార్ మచ్చి మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి దారుణ ఘటన జరిగింది. ప్రేమ వివాహం చేసికున్న జంటను అత్యంత దారుణంగా 20 కత్తిపోట్లు పొడిచి హత్య చేశారు. ఈ పరువు హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితులు కర్ణాటక వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌కు 150 కి.మీ.దూరంలో కర్ణాటకలోని గుడిమిత్కల్‌లో నిందితులను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అయితే సీసీ కెమెరాల ఆధారంగా హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ మర్డర్ కేసులో అనుమానం ఉన్న మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్‌కుమార్ పన్వర్(22) పల్లీల వ్యాపారం చేస్తుంటారు. అదే ప్రాంతానికి చెందిన సంజన(20)ను ఏడాదిన్నర కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి నెలన్నర క్రితం బాబు పుట్టాడు. ప్రేమ పెళ్లి ఇష్టంలేని సంజన కుటుంబసభ్యులు నీరజ్ కుమార్ పై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. నీరజ్‌ను సంజన సోదరుడు ఆరునెలలుగా చంపాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సంజన సోదరుడు, అతని స్నేహితులు నీరజ్ రోడ్డు దాటుతున్నప్పుడు వెనుక నుంచి గ్రానైట్ రాయితో దాడి చేశారు. రాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం నీరజ్ ను వెంబండించి కొబ్బరిబొండాల కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.
హైదరాబాద్‌లో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న నాగరాజు పరువు హత్య మరవకముందే నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బేగం బజార్ లోని మచ్చి మార్కెట్ వద్ద నీరజ్ పన్వార్ అనే ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడి వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. పోలీసుల కథనం ప్రకారం.. బేగం బజార్ షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నీరజ్ పన్వార్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నీరజ్ పన్వార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు రాళ్లతో కూడా యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 సార్లు కత్తితో పొడవడంతో నీరజ్ పన్వార్ కుప్పుకూలిపోయి అక్కడే మరణించాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో పగ పెంచుకున్న యువతి బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏడాది కిందట నీరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
మచ్చి మార్కెట్‌లో దారుణం..
నగరంలో ఇటీవల జరిగిన నాగరాజు పరువు హత్యను హైదరాబాద్ వాసులు మరిచిపోకముందే నడిబొడ్డున మరో వ్యక్తిని హతమార్చారు. గత ఏడాది నీరజ్ పన్వార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి అమ్మాయి కుటుంబసభ్యులు అతడిపై కక్షకట్టారు. ఈ క్రమంలో నలుగురు గుర్తుతెలియని దుండగులు బేగం బజార్ మచ్చి మార్కెట్‌లో వెళ్తున్న నీరజ్ పన్వార్ బైక్ అడ్డుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారు. వెంటనే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి శరీరంపై 10 నుంచి 20 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. పరువు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.