Guntur Crime News: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. చిలువురు హత్య కేసును చేధించిన పోలీసులు
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురులో హత్యకు గురైన వ్యాపారి కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యనే హత్య చేసింది.

దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువురులో సంచలనం సృష్టించిన హత్య కేసు మిస్టరీని మంగళగిరి రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. భార్య తన ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ ప్రకటించారు.
వివాహేతర సంబంధం..
గుంటూరు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చిలువూరుకు చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజుకు లక్ష్మీమాధురితో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో విజయవాడలో థియేటర్ టికెట్ కౌంటర్‌లో లక్ష్మీమాధురి పనిచేసింది. ఆ సమయంలో సత్తెనపల్లికి చెందిన గోపితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. మరోవైపు చిన్న చూపు చూసి భర్త వ్యాపారాన్ని మాన్పించేసింది. హైదరాబాద్‌లో ట్రావెల్స్ నిర్వహిస్తున్న ప్రియుడు గోపి వద్దకు భర్తను ఉద్యోగానికి పంపింది. కొంతకాలానికి నాగరాజు హైదరాబాద్ నుంచి సొంతవూరుకి వచ్చేశాడు. భార్య వ్యవహారం నచ్చక మందలించాడు. అవి విభేదాలకు దారితీసి గొడవలు జరిగాయి. భర్త శివనాగరాజు ఇంటివద్ద నుంచే వ్యాపారం చేయడంతో గోపీని కలుసుకునే అవకాశం చిక్కడం లేదని, అతడి అడ్డు తప్పించుకోవాలని లక్ష్మీమాధురి భావించింది.

అప్పడాల కర్రతో కొట్టి చంపేశారు..
నిందితురాలు లక్ష్మీ మాధురి తన భర్త శివనాగరాజు తనను వేధిస్తున్నాడని ప్రియుడు గోపికి చెప్పడంతో ఇద్దరు కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇందుకోసం గోపి తన స్నేహితుడైన కంభంపాటి సురేష్ (ఆర్ఎంపి) వద్ద నుండి నిద్ర మాత్రలు సేకరించి మాధురికి ఇచ్చాడు. పక్కా ప్లాన్ ప్రకారం, ఈ నెల 18వ తేదీన మాధురి ఆ నిద్ర మాత్రలను పొడిగా చేసి బిర్యానీలో కలిపి భర్తకు పెట్టింది. శివనాగరాజు నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత, నిందితులు అతడి కాళ్లు చేతులు పట్టుకుని, ఛాతీపై అప్పడాల కర్రతో బలంగా కొట్టి ప్రాణాలు తీశారు.

హత్య అనంతరం, భర్త గుండెపోటుతో మరణించాడని నమ్మించేందుకు నిందితురాలు ప్రయత్నించింది. అయితే, మృతుడి చెవి నుంచి రక్తం వచ్చినట్లు గమనించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా మృతదేహంపై గాయాలు కనిపించకపోయినా, పోస్ట్‌మార్టం నివేదికలో ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో లక్ష్మీమాధురి తప్పు ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన వివరాలతో ప్రియుడు గోపీతో పాటు అతడి స్నేహితుడు సురేష్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకూల్ జిందాల్ స్పష్టం చేశారు.



















