Crime News: హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం, లిఫ్ట్ ఇస్తామని కారులో తీసుకెళ్లి..

హైదరాబాద్: నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. విదేశీ యువతికి లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జర్మనీకి చెందిన ఓ యువతి మీర్పేట వద్ద తాను వెళ్లాల్సిన అడ్రస్ కోసం చూస్తోంది. మీర్పేట్ పిఎస్ పరిధిలోని మందమల్లమ్మ వద్ద కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను పలకరించారు. ఆమె చెప్పిన చోట డ్రాప్ చేస్తామని నమ్మించి, ఆమెను కారులో తీసుకెళ్లారు. అసలే విదేశీయురాలు కూడా కావడంతో అవకాశంగా తీసుకున్న నిందితులు.. ఆమెను మభ్యపెట్టి పహాడీ షరీఫ్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని అక్కడే వదిలేసి వెళ్లగా.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, కారులో తీసుకెళ్లిన యువకులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు మీర్పేట్ లోని మందమల్లమ్మ నుంచి పహాడిషరీఫ్ వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసుందుకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















