Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు
Amaravati Latest News: అమరావతి పనుల్లో ఈ మధ్య ప్రమాదం జరిగింది. ఓ కార్మికుడి మృతి చెందాడు. దీనిపై ప్రపంచ బ్యాంకు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీ వేసింది.

Amaravati Latest News: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై ప్రపంచ బ్యాంకు బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. పనుల్లో కార్మికుల రక్షణ కోసం ఒప్పందం ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. ఇటీవల అమరావతి పనుల పరిశీలనకు వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందం ముందుగా దొండపాడులోని ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. అక్కడ లేఅవుట్ పనుల్లో మట్టి పెళ్లలు విరిగిపడి యువ కార్మికుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ నివేదిక పంపింది.
నెలవారీ పరిశీలనకు వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందం దొండపాడు సమీపంలోని కార్మికుడు మృతిచెందిన లేఅవుట్‌ను, పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఘటనకు కారణాలను అడిగి తెలుసుకుంది. దీనిపై అధికారులిచ్చిన వివరణకు సంతృప్తి చెందకపోవడంతోపాటు అక్కడి సమీక్ష సమయంలో కార్మికుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని పేర్కొంది. ఇప్పటి వరకూ సమర్పించిన నివేదికల ప్రకారం చూస్తే కార్మికుడి మరణం జరగకూడదని, అలా ఎందుకు జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది.
పని ప్రదేశంలో కార్మికుల రక్షణకు నిధుల విడుదలకు సంబంధం ఉండటంతో ప్రభుత్వం వెంటనే కారణాలను అన్వేషించే పనిలో పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పునకు సంబంధించి విధించిన షరతుల్లో భాగంగా ఒప్పందం చేసుకున్న డిస్బర్స్మెంట్ లింక్డ్ ఇండికేషన్ (డిఎల్ఐ)లో ఈ అంశం కూడా ఉండటంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది.
దీంతో మొత్తం విచారణ కోసం ఎడిసిఎల్ చీఫ్ ఇంజినీరుతోపాటు మరో అధికారితో కలిపి ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అసలు మరణం ఎందుకు జరిగింది? లోపం ఏమిటి ? పనిలో జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ప్రమాదం జరిగిన తరువాత ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలను కమిటీ విచారించి నివేదిక ఇవ్వనుంది.
ట్రెండింగ్ వార్తలు






















