తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ప్రకారం, GHMC, మిగతా రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు.
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Ramachander Rao | జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. నేతల మధ్య విభేదాలు లేవని తెలిపారు.

BJP in GHMC Elections | ఢిల్లీ: త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), మిగతా రెండు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో కీలక భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య ఎలాంటి తీవ్ర విభేదాలు లేవని, కేవలం కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పార్టీలో పాత, కొత్త నాయకులనే భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని తెలిపారు. పలువురు కీలక నేతలు కూడా త్వరలోనే భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయింది..
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన రామచందర్‌రావు, రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని రామచందర్ రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇతర హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ నాయకులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని నితిన్ నబీన్ నిర్దేశించారని ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వెల్లడించారు. రాబోయే రోజుల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి సమగ్రమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని జాతీయ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 937 మండలాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణలో బీజేపీ మరింత బలపడి, అధికారంలోకి రావడానికి రూట్ క్లియర్ అవుతుందనే దీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకులు, కార్యకర్తలకే రాబోయే ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని రామచందర్‌రావు వివరించారు.
Frequently Asked Questions
GHMC ఎన్నికల్లో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా?
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రధాన విమర్శలు ఏమిటి?
కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ ఆరోపించింది.
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
రాష్ట్రవ్యాప్తంగా 937 మండలాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని జాతీయ నాయకత్వం నిర్దేశించింది.
ట్రెండింగ్ వార్తలు






















