రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన డాక్టర్ ప్రియాంక వారం రోజులు చికిత్స పొందిన తర్వాత సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో మృతిచెందారు.
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమహేంద్రవరం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో డాక్టర్ ప్రియాంక, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు.

- రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి.
- మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొని ఆమెపై పోనిచ్చారు.
- పోలీసులు నిందితులను అరెస్టు చేసి హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
- ఎస్పీ ప్రకారం ఇది సాధారణ ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వక చర్య.
Rajahmundry Medical Student Passes Away | హైదరాబాద్: రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఘటన విషాదాంతమైంది. గత వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్న మెడికల్ స్టూడెంట్ ప్రియాంక కన్నుమూశారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3:25 గంటలకు మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఇటీవల రాజమండ్రిలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో మూడుసార్లు ఢీకొట్టడంతో పాటు ప్రియాంక మీద నుంచి వెళ్లడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ తరలించారు. ఆమెకు ఇదివరకే బ్రెయిన్ డెడ్ అయిందని, ఆమె చనిపోయారని సైతం రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. కానీ తలకు తీవ్రమైన గాయం కావడంతో డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మెడికో ప్రియాంక మృతిచెందింది. డాక్టరై ప్రజలకు సేవ చేస్తుందని, సమాజంలో ఉన్నత స్థానంలో నిలుస్తుందనుకున్న కుమార్తె ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె బంధువులు, స్నేహితులు ప్రియాంకకు జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలేం జరిగిందంటే..
ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులోని మాల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ ప్రియాంక తన స్నేహితుడితో కలిసి స్కూటీపై వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే యువకులు కారుతో మూడుసార్లు ఢీకొట్టారు. అనంతరం కిందపడిన ప్రియాంకపై నుంచి కారును అలాగే పోనివ్వడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. సీసీటీవీ ఆధారంగా ప్రకాష్ నగర్ పోలీసులు నిందితులపై హత్యాయత్నం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయగా, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
మరోవైపు తన కుమార్తె పరిస్థితిపై కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రియాంక తండ్రి వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టాలెంటెడ్ అయిన తమ బిడ్డ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తరచూ హైదరాబాద్ వచ్చే నాయకులు తమ బిడ్డ ఆరోగ్యం గురించి కనీసం సమాచారం తెలుసుకోలేరా అని ప్రశ్నించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించి, నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేశారు.
సాధారణ రోడ్డు ప్రమాదం కాదు.. ఉద్దేశపూర్వక కుట్ర: తూర్పు గోదావరి ఎస్పీ
ఈ ఘటన సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వక క్రిమినల్ చర్య అని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. బాధితురాలు ప్రియాంకను హత్య చేసేందుకు యత్నించారనే తీవ్ర ఆరోపణలతో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు కీలక ఆధారాలు సేకరించడంతో పాటు, బాధితురాలి స్నేహితుడు ఉమేష్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. షాపింగ్ మాల్ వద్ద జరిగిన వాగ్వాదం తర్వాత నిందితులు కావాలనే తమ కారుతో వారి వాహనాన్ని పలుమార్లు ఢీకొట్టినట్లు లభించిన ఆధారాల ద్వారా తేలింది. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించగా ప్రియాంకపైకి కారును పోనిచ్చి హత్యాయత్నం చేశారని ఎస్పీ వెల్లడించారు.
Frequently Asked Questions
రాజమహేంద్రవరం మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రియాంక ఎలా మరణించారు?
ప్రియాంక మృతికి దారితీసిన ప్రమాదం ఎలా జరిగింది?
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ప్రియాంక స్కూటీని మూడుసార్లు ఢీకొని, కిందపడిన ఆమెపై నుంచి కారును పోనివ్వడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదానికి కారణమైన నిందితులు ఎవరు? వారిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు?
సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే యువకులు ఈ ప్రమాదానికి కారణం. వారిపై హత్యాయత్నం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ ఘటన గురించి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఏమన్నారు?
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఈ ఘటన సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వక క్రిమినల్ చర్య అని స్పష్టం చేశారు. నిందితులు హత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు






















