Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Andhra News: అనంతపురం జిల్లా నార్పలలో తీవ్ర విషాదం జరిగింది. అప్పుల బాధతో దంపతులు చిన్నారి సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Family Members Forceful Death In Anantapuram: అనంతపురం జిల్లాలో (Anantapuram District) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చిన్నారితో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్పల మండలం కేంద్రంలోని సంతబజారులో కృష్ణ కిశోర్ (45), శిరీష (35) దంపతులు తమ 5 నెలల చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు గత 5 రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంట్లో నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పక్కింటి మిద్దెపై నుంచి ఇంట్లోకి చూశారు. దుర్వాసన మరింతగా రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
తలుపులు బద్దలుకొట్టిన పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సాగర్, ఆర్ఐ జ్యోతి, ఏఎస్సై నాగరాజు ఇంటి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. దంపతులు ఉరి వేసుకుని చనిపోయారు. ఉయ్యాలలో 5 నెలల చిన్నారి విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యల వల్లే దంపతులు ఇలా చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. కిషోర్ మెడికల్ స్టోర్ నిర్వహించేవాడని ఈ క్రమంలోనే అప్పులు ఎక్కువయ్యాయని పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకుని నాలుగైదు రోజులు కావడంతో మృతదేహాలు కుళ్లిపోయే దశకు చేరుకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.