Eluru Murder Arrest: తమ్ముడ్ని చంపేసిన అన్న వదినలు - పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి
Eluru News: భూ తగాదాల నేపథ్యంలో తమ్ముడిని అన్న వదిన, కుమారులు చంపేశారు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.
ఏలూరు జిల్లా, నూజివీడు మండం, సుంకొల్లు గ్రామంలో భూ తగాదా విషయంలో జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఈ ఘటనలో సొంత తమ్ముడినే అన్న, వదినతో పాటుగా కుమారులు కలసి హత్యచేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నదమ్ముల మధ్యలో జరిగిన ఘర్షణలో మృతి చెందిన తమ్ముడు సింహాద్రి రవి కుమార్ హత్య కేసులో నిందితుల వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు, మృతుడు రవి కుమార్ కు సొంత అన్న, వదిన మరియు అన్న కుమారులు కావటం కొసమెరుపు. భూమి తగాదాల విషయంలో మృతుడిని కర్రలతో కొట్టి చంపేసినట్లుగా నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. అన్నదమ్ముల మధ్య భూమి వివాదం, కారణంగానే హత్య జరిగిందదని, ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని పోలీసులు తెలిపారు.
నూజివీడు రూరల్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సుంకొల్లులో జరిగిన రవి కుమార్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన విషయం, హత్యకు దారితీసిన కారణాలను నూజివీడు DSP, బుక్కాపురం శ్రీనివాసులు తెలిపారు. మృతుడు సింహాద్రి రవి కుమార్, తండ్రి సింహాద్రి వెంకటేశ్వరరావు తన కొడుకులు సింహాద్రి రామకృష్ణరావు, సింహాద్రి మురళీ మోహన్, సింహాద్రి రవి కుమార్ మరియు కూతురు శివ నాగేంద్రమ్మలకు చెందిన 7 ఎకరాల వ్యవసాయ భూమిని వాటాలుగా పంచి ఇచ్చారు.
అయితే పంపకాల విషయంలో సుమారు 3 సంవత్సరాల నుండి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాల వాళ్ళు గ్రామంలో పెద్దలు ఎవ్వరూ చెప్పినా వినకుండా తరచూ గొడవలు పడుతూనే ఉన్నారు. జూన్ 14న ఉదయం సుమారు 6 గంటల సమయంలో మృతుడు సింహాద్రి రవి కుమార్ తన గడ్డివాము దగ్గరకు గడ్డి తీసుకుని రావడానికి వెళ్ళగా అక్కడ ఉన్న సింహాద్రి రామకృష్ణారావు, అతని భార్య సింహాద్రి అలివేలు మంగమ్మ వారి కుమారులు సింహాద్రి చంద్రశేఖర్, సింహాద్రి వంశీకృష్ణ లు మృతుడు సింహాద్రి రవి కుమార్ తో మరియు అతని కొడుకు కార్తీక్ తో భూమి తగాదా విషయములో ఒకరికొకరు గొడవ పడ్డారు.
గొడవ పెద్దది కావటంతో కర్రలతో కొట్టి సింహాద్రి రవి కుమార్ ను హత్య చేశారు. మృతుడి కుమారుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నూజివీడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏలూరు జిల్లా SP రాహుల్ దేవ్ శర్మ, ఆదేశాలతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. జూన్ 15 మధ్యాహ్నం 3 గంటలకు యలమండల గ్రామ చెక్ పోస్ట్ వద్ద సింహాద్రి రవి కుమార్ ని హత్య చేసినటువంటి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులను విచారణ జరపగా భూ వివాదం కారణంగా తరచూ మృతుడు రవి కుమార్ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని నిన్న జరిగిన ఘర్షణలో మృతుడిని కొట్టి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారని ఒప్పుకున్నారు. హత్యకు ఉపయోగించిన మూడు కర్రలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం నిందితులు నలుగురిని కోర్ట్ లో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.