Student Teacher Love: టీచర్‌తో పీకల్లోతు లవ్‌లో మైనర్ స్టూడెంట్, పెళ్లి కుదరగానే మారిన సీన్, షాకింగ్ నిర్ణయం!
చెన్నైలో విద్యార్థి మృతికి కారణమైన టీచర్ ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. ప్రేమాయణం నడిపించి పెళ్లి కుదరగానే అతనితో మాటలు మానేసింది.
Student Suicide: విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే పెడదారులు పడుతున్నారు. విద్యార్థులు కన్న బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి వారితోనే ఆ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఒకటి రెండ్రోజుల క్రితం హైదరాబాద్ లోని ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్ ను ప్రేమించాలంటూ, పెళ్లి చేసుకోవాలంటూ వేధించిన కేసులో పోక్సో కోర్టు శిక్ష విధించిన వార్త తెలిసిందే. అది మర్చిపోకముందే మరొకటి అలాంటి వార్తే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు చేసే ఇలాంటి నీచపు పనుల వల్ల మొత్తం ఉపాధ్యాయులకే చెడ్డ పేరు వస్తోంది. టీచర్లు అనగానే అనుమానించాల్సిన దుస్థితి తలెత్తే ప్రమాదం ఉందని ఇలాంటి వార్తలు విన్న తర్వాత సాధారణ ప్రజలు అంటున్నారు.
ఇంట్లో ఉరేసుకుని మృతి
విద్యార్థి ఆత్మహత్య కేసులో ఉపాధ్యాయురాలిని తమిళనాడు రాష్ట్రం చెన్నైలో పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంబత్తూరుకు చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థి ఈ మధ్యే ప్లస్ టూ పూర్తి చేశాడు. ఆగస్టు 30వ తారీఖున మిత్రులతో కలిసి చెన్నై రాజధాని కాలేజీలో కౌన్సెలింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చాడు. తర్వాత గదిలోకి వెళ్లిన ఆ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. తల్లిదండ్రులు గమనించి హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. మార్గ మధ్యంలోనే ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సూసైడ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది.
పెళ్లి నిశ్చయం కావడంతో మాటలు బంద్
ప్రేమ వ్యవహారంలో విఫలం కావడంతోనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఆ ప్రేమ వ్యవహారం తన టీచర్ తోనే నడిపించాడని పోలీసులు గుర్తించారు. అంబత్తూరులోని సర్ రామస్వామి ముదలియార్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో బాలుడు చదువుతున్న సమయంలోనే ఓ మహిళ అందులో పని చేసేది. ఆమె పాఠశాలలో చేస్తూనే ప్రైవేటుగా ట్యూషన్లు కూడా చెబుతుండేది. ఆ ట్యూషన్లకు వెళ్లే వాడు ఆ బాలుడు. అలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ప్రేమిస్తున్నట్లు ఆ ఉపాధ్యాయురాలు చెప్పినట్లు సమాచారం. అయితే ఆ టీచర్ కు ఈమధ్యే పెళ్లి నిశ్చయం కావడంతో... బాలుడితో మాట్లాడటం మానేసింది. తనను పూర్తిగా పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు సూసైడ్ కేసులో ఉపాధ్యాయురాలిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ మీర్ పేటలో ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని వేధించాడు. ఫోన్ కాల్స్, మెసేజీలు చేస్తూ వేధించాడు. ఒకటీ రెండు సార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని బాలిక ఇంటికి కూడా వెళ్లి బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రమేష్ ను హెచ్చరించి వదిలేశారు. మరోసారి అలా చేస్తే పోలీసు కేసు పెడతామని బెదిరించారు. బాలిక నుండి వచ్చిన బెదిరింపుల తర్వాత యాచారం రమేష్ మరింత రెచ్చిపోయాడు. గతంలోని కాల్ రికార్డింగ్ లను ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో వారు రమేష్ పై మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రమేష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. పోక్సో కోర్టు ఆ ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.