Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
ACB Trap: శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు క్రైమ్ కామెడీ సినిమాలోని సీన్లను తలపించాయి. లంచం తీసుకుంటూ దొరికిపోతామనే భయంతో అధికారులు చేసిన విన్యాసాలు చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు.

Shamshabad Tahsildar Bribery Case: ఏసీబీ దాడులు చేసినప్పుడు డబ్బులు,ఫైళ్లను ఎక్కడెక్కడో దాచి పెట్టే సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ ఇలాంటివి నిజంగా జరుగుతాయి. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం బుధవారం ఇలాంటి ఒక హై-డ్రామాకు వేదికైంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడి చేయడంతో, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో వణుకు మొదలైంది. ఏసీబీ కంట పడకుండా ఉండేందుకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి. కృష్ణ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన వద్ద ఉన్న రూ.29,650 నగదును బయట పారేయడమే కాకుండా, ఒక కీలకమైన ప్రభుత్వ ఫైలును ఏకంగా టాయిలెట్ పైకప్పు మీద దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.
అవినీతి తీగ లాగితే తహసీల్దార్ కారు డ్యాష్ బోర్డులో డొంక కదిలింది. తహసీల్దార్ కె. రవీందర్ దత్ కారును తనిఖీ చేయగా, అందులో లెక్కల్లో చూపని రూ.60,000 నగదు లభించింది. అలాగే లైసెన్స్‌డ్ సర్వేయర్ ఎస్. పృథ్వీరాజ్ వద్ద మరో రూ.10,000 అక్రమ నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. కార్యాలయంలో ఏ సెక్షన్‌ను కదిలించినా అక్రమాలే దర్శనమివ్వడంతో అధికారులు విస్తుపోయారు.
కేవలం డబ్బులే కాకుండా, పరిపాలనా పరంగా జరిగిన ఘోర తప్పిదాలు కూడా బయటపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసినా 68 మీ-సేవ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, తన పరిధిలో లేని శంషాబాద్, తొండపల్లి, సాతంరాయి గ్రామాలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ప్రొసీడింగ్స్ జారీ చేయడంలో తహసీల్దార్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఏసీబీ తేల్చింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమ మార్గాల్లో పనులు చక్కబెడుతున్నట్లు నిర్ధారించారు.
శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో తహసీల్దార్ కారు డ్యాష్‌బోర్డ్ నుంచి రూ.60 వేలు సహా మొత్తం రూ.99,650 అన్అకౌంటెడ్ నగదు స్వాధీనం చేసుకున్నారు. pic.twitter.com/zWFzdCkPao
— TG Govt Updates (@TGGovtUpdates) May 13, 2026
ఈ దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలకు సంబంధించి అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. సామాన్యుల పనులను పెండింగ్‌లో పెట్టి, అక్రమార్కుల కోసం నిబంధనలు పక్కన పెట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ స్పష్టం చేసింది. సినిమా స్టైల్‌లో తప్పించుకోవాలని చూసినా, సాంకేతిక ఆధారాలతో సహా నిందితులను పట్టుకున్న ఏసీబీ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
ట్రెండింగ్ వార్తలు






















